Congress tension: ఝార్ఖండ్ లోనూ మహా సీన్ రిపీట్ అవుతుందా..?
Congress tension in Jharkhand: 2019 లో జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ ఏర్పడింది. దీంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో జేఎంఎం పార్టీకి 30 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 16, బీజేపీ 25 చోట్ల విజయం సాధించింది. ఝార్ఖండ్ లో మొత్తం 28 గిరిజన స్థానాల్లో 26 చోట్ల జేఎంఎం కాంగ్రెస్ కూటమి విజయం సాధించగా కేవలం 2 చోట్ల మాత్రమే బీజేపీ విజయం సాధించింది. హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత అనేకమార్లు బీజేపీని బహిరంగంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్ధిని ఎంపిక చేసే తరుణంలో విపక్షాలు నిర్వహించిన భేటీలో హేమంత్ చురుగ్గా పాల్గొన్నారు. యశ్వంత్ సిన్హా కు మద్దతు పలికారు. అయితే, సడన్ గా సీఎం హేమంత్ ప్లేట్ ఫిరాయించి అధికార ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఓటు వేయాలని శాసనసభ్యులకు, ఎంపీలకు ఆదేశాలు జారీ చేయడంతో ఝార్ఖండ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
సీఎం హేమంత్ సొరేన్ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పార్టీ ఖంగుతిన్నది. ఇటీవలే సీఎం, అతని సన్నిహితుల ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు చేసింది. ఈ దాడుల తరువాత హేమంత్ లో ఈ మార్పులు చోటు చేసుకోవడం విశేషం. అంతేకాదు, ఇటీవల ప్రధాని ఝార్ఖండ్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆయన వెంటే ఉండి అన్ని పనులు చూసుకున్నారు. ప్రధానిని పొగుడుతూ ప్రసంగించారు. కేంద్రం సహాయ సహకారాలతో ఝార్ఖండ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. హేమంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో షాకైనా కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలు సీఎం తో దూరాన్ని పాటించాలని ఆదేశించింది. మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఝార్ఖండ్ లో కూడా ఇదే తరహా వ్యూహానికి బీజేపీ పదును పెడుతుందా అన్న సందేహాలు కాంగ్రెస్ ని వెంటాడుతున్నాయి.