గుడ్డు బలవర్ధకమైన ఆహారం. పోషకాహార నిపుణులు కచ్చితంగా తినమని చెబుతారు.
Raw Eggs: సంపూర్ణ ఆహారం అంటే కోడిగుడ్డే (Eggs). అందులో మన శరీరానికి అవసరమైన పోషకాలు (Nutrition) అన్ని పుష్కలంగా ఉంటాయి. అందుకే రోజుకో గుడ్డు (Daily one Egg) తినమని ప్రభుత్వం కూడా ప్రజలకు చెబుతోంది. రోజుకో గుడ్డు తినడం వల్ల మన శరీరానికి అవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు (Amino Acids) గుడ్డు ద్వారా అందుతాయి. అయితే గుడ్డును ఎలా తింటే మన శరీరానికి పోషకాలు (Nutrition) పుష్కలంగా అందుతాయి? అన్న విషయంపై ఎంతోమందికి అవగాహన లేదు. కొంతమంది పచ్చి గుడ్డును పగలగొట్టి తాగేస్తుంటారు. అలా చేయడం వల్ల బలం వస్తుందని అనుకుంటారు. కానీ గుడ్డును పచ్చిగా తినకూడదు. ఉడికించి తినడం మంచిది. పచ్చి గుడ్డులో కొన్ని రకాల బ్యాక్టీరియాలు ఉండే అవకాశం ఉంది. దీనివల్ల శరీరంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. పచ్చిగుడ్డులో సాల్మొనెల్లా అనే పదార్థం ఉంటుంది. ఇది పోషకాహార నిరోధకంగా పనిచేస్తుంది. అంటే శరీరం పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటుంది. గుడ్డును వేడి చేయడం వల్ల ఈ ఎంజైములు నిర్వీర్యంగా అవుతాయి. దీనివల్ల గుడ్డులోని పోషకాలు అన్ని శరీరం గ్రహించుకుంటుంది. కాబట్టి ఆమ్లెట్ గా వేసుకుని, లేదా ఉడికించుకుని తినడం మంచిది. పచ్చి గుడ్డును తినకపోవడం చాలా మేలు.
మనదేశంలో రోజూ గుడ్డు తినే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. 47% ప్రజలు మన దేశంలో ఉండాల్సిన దానికన్నా తక్కువ బరువును కలిగి ఉన్నారు. వారంతా గుడ్డు వాడకాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. వారానికి ఐదు నుంచి ఆరు గుడ్లు తినొచ్చు. పిల్లలు, గర్భిణులు ప్రతిరోజు గుడ్డు తినడం ఎంతో మంచిది. గుడ్డు తెల్ల సొన వల్ల కొంతమందిలో ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ముందుగా పడుతుందో లేదో తిని చూడండి. ఆరోగ్యపరంగా ఎలాంటి అవాంతరాలు కనిపించకపోతే, గుడ్డుని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇప్పుడు ఎక్కువగా ఫారం గుడ్లే దొరుకుతున్నాయి. నాటుకోడి గుడ్లు దొరకడం కష్టంగా ఉంది. ఫారం గుడ్డును అయినా తినడం మంచిదే. ఫారంలోని కోళ్లకు ప్రత్యేకంగా ఆహారాన్ని తినిపిస్తారు. కాబట్టి ఆ గుడ్డులో అన్ని పోషకాలు ఉండే అవకాశం ఉంది. విటమిన్ డి కూడా ఈ గుడ్డులో లభించవచ్చు. కాబట్టి నాటు కోడిగుడ్డు అయినా లేక ఫారం కోడి గుడ్డు అయినా తినడం ముఖ్యం.
చంటి పిల్లలకు మొదటగా గుడ్డులోని పచ్చసొన తినిపించాలి. ఉడికించిన గుడ్డులోని పచ్చసొన వేరుచేసి కాస్త నీళ్లు లేదా పాలు కలిపి మిశ్రమంగా మార్చి వారికి తినిపిస్తే మంచిది. ఆరు నెలల వయసు నుంచే దీన్ని పెట్టవచ్చు. ఏడాది దాటాక తెల్ల సొన పెట్టాలి. ఏడాదిలోపు తెల్ల సొన పెడితే అది మింగలేక ఇబ్బంది పడతారు.
గుడ్డు తినడం వల్ల ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. పప్పులో కూడా ప్రోటీన్లు ఉంటాయి. కానీ ఇవి సరిగా జీర్ణం అవ్వవు. కానీ గుడ్డులోని ప్రోటీన్లు చక్కగా జీర్ణం అవుతాయి. ఇవి ఎదుగుదలకు కూడా సహకరిస్తాయి. కాబట్టి పిల్లలకు అన్నం, పప్పుతో పాటు రోజూ గుడ్డును కూడా తినిపించాలి.