రాహుల్ ఓయూ పర్యటనపై హైకోర్టు కీలక సూచనలు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన విషయమై అనుమతి కోరుతూ దాఖలైన హౌజ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఓయూ విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం కోసం దాఖలు చేసిన అప్లికేషన్ ను పరిశీలించాలని వైస్ ఛాన్స్ లర్ ని ఆదేశించింది. హౌజ్ మోషన్ పిటిషన్ పై విచారణకు అటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ ఇటు ఉస్మానియా యూనివర్సిటీ తరఫున గానీ న్యాయవాదులు హాజరుకాలేదు. దీంతో పిటిషన్ పై విచారణను హైకోర్టు ముగించింది. రాహుల్ కార్యక్రమానికి ఓయూ పాలక మండలి అనుమతి నిరాకరించిన కొద్దిసేపటికే న్యాయస్థానం ఈ ఆదేశాలను జారీచేయటం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాహుల్ కార్యక్రమానికి అనుమతి కోరుతూ ఓయూ రీసెర్చ్ స్కాలర్లు కొందరు గత నెల 28నే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా మే 2వ తేదీన హౌజ్ మోషన్ పిటిషన్ వేయాలని లేదా 5వ తేదీన రెగ్యులర్ కోర్టులో పిటిషన్ వేయాలని హైకోర్టు సూచించింది. రాహుల్ కార్యక్రమానికి అనుమతిపై కోర్టు తీర్పు అనంతరం నిర్ణయం తీసుకుంటామని గతంలో చెప్పిన వీసీ ప్రొఫెసర్ రవీందర్ యాదవ్ ఆ మాటను మర్చిపోయి ఇవాళ అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై ఆయన తాజాగా ఎలా స్పందిస్తారో చూడాలి.