ఇక్కడ కనిపిస్తున్న పండుని ఎప్పుడైనా చూసారేమో గుర్తుకు తెచ్చుకోండి.
Elephant Apple: ప్రపంచంలో (World)ఎన్నో రకాల పండ్లు (Fruits) ఉన్నాయి. కానీ మనం తినేది మాత్రం కొన్ని రకాలు మాత్రమే. అందుకే ఈ పండు ఎక్కువ మందికి తెలిసే అవకాశం లేదు. కానీ తెలియకుండానే ఈ పండుతో తయారు చేసిన చాలా పదార్థాలు (Foods)ఎంతోమంది తినే అవకాశం ఉంది. ఎందుకంటే దీన్ని చాలా రకాల కేకులు, మఫిన్లు, జామ్‌లు తయారీలో వాడతారు. ఈ పండు పేరు ఎలిఫెంట్ ఆపిల్ (Elephant Apple). శాస్త్రీయంగా డాల్లానియా ఇండికా అని పిలుస్తారు. ఏనుగులు (Elephant) చాలా ఇష్టంగా వీటిని తింటారు. అందుకే ఈ పండుకు ఎలిఫెంట్ అనే పేరు జత చేరింది. మనుషులు కూడా వీటిని తింటూ ఉంటారు. సాధారణంగా వీటిని చట్నీలు, ఊరగాయల్లో వాడతారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ యాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఎక్కువ.
ఈ పండు చర్మం చాలా దృఢంగా, మందంగా ఉంటుంది. ఇది ఆకుపచ్చ, పసుపు రంగులో ఉంటుంది. లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది. రుచి పుల్లగా ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఈ పండును జ్వరం, పొట్ట సమస్యలు, శ్వాసకోశ సమస్యలు వంటి వాటి చికిత్సలో వాడతారు. ఈ పండులో విటమిన్ సి, విటమిన్ ఈ, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. చర్మ సౌందర్యాన్ని కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. చర్మంలో కొల్లాజెన్ సంశ్లేషణను సులభతరం చేస్తుంది. ఒక గ్లాసు తాజా ఎలిఫెంట్ ఆపిల్ జ్యూస్ తాగితే చర్మం చాలా మెరుపు సంతరించుకుంటుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికమని చెప్పుకున్నాం కదా, ఫ్రీ రాడికల్స్‌తో పోరాడే శక్తిని కూడా ఇది అందిస్తుంది.
ఈ పండ్లు తినడం వల్ల అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. అలాగే గుండె కొట్టుకునే రేటు నియంత్రణలో ఉంటుంది. గుండె ఆరోగ్యాన్ని ఈ పండు కాపాడుతుంది. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ పండులో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు మాంసకృతులు ఉంటాయి. ఇవి జీవక్రియను సక్రమంగా నిర్వహిస్తాయి. మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. మెదడు కార్యాకలాపాలను చురుగ్గా మారుస్తాయి.
విటమిన్ ఏ, కెరటోనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, లూటీన్, జియాక్సింతిన్ వంటివి ఎన్నో ఇందులో ఉన్నాయి. ఇది కళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రెటీనాను బలోపేతం చేస్తాయి. ఈ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఎక్కువ. కంటి శుక్లాలు, గ్లాకోమా వంటివి రాకుండా ఇది అడ్డుకుంటాయి.