Google co founder: విడాకుల బాటలో మరో హై ప్రొఫైల్ జంట..ఈ నెలలోనే..!
ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ గూగుల్ సహా వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ విడాకులు తీసుకున్నారు. 2018 లో సెర్జీ బ్రిన్, నికోల్ కు వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం మూడేళ్ళ పాప ఉంది. సెర్జీ బ్రిన్ ప్రపంచ కుబేరుల్లో ఒకరు కావడంతో, చిన్నారి వివరాలు బయటకు రాకుండా ఉండేందుకు ప్రైవేట్ న్యాయమూర్తిని ఆశ్రయించారు. ఈనెలలోనే సెర్జీ బ్రిన్ పిటిషన్ దాఖలు చేశారు. వివాహం తరువాత విరుద్ధ స్వభావాలు కలిగి ఉండటంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. మనస్పర్థల కారణంగా 2021 నుంచే ఈ జంట విడిగా ఉంటున్నారు.
2007లో సెర్జీ బ్రిన్ 23 అండ్ మీ కో ఫౌండర్ అన్నే వోజిస్కీ ని వివాహం చేసుకున్నారు. 2015 లో వీరు అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అన్నే వోజిస్కీ నుంచి విడిపోయిన తరువాత సెర్జీ బ్రిన్ నికోల్ తో సహజీవనం చేశారు. 2018 లో వివాహం చేసుకున్నారు. అయితే మనస్పర్థల కారణంగా నాలుగేళ్ళలోనే ఈ జంట కూడా విడిపోవడం విశేషం. కొన్ని నెలల క్రితం బిల్ గేట్స్ దంపతులు, అంతకుముందు అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. ఇక 1998లో లారీ పేజ్ సెర్జీ బ్రిన్ తో కలిసి గూగుల్ ను స్థాపించారు. తరువాత ఆ సంస్థను ఆల్ఫాబెట్ గా మార్చారు. 2019 లో సెర్జీ తో పాటు లారీ పేజ్ ఆ కంపెనీ నుంచి బయటకు వచ్చారు. అయితే కంపెనీలో షేర్లు ఉన్నందున ప్రస్తుతం వారు బోర్డు సభ్యులుగా కొనసాగుతున్నారు.