చేప ప్రసాదం పంపిణీ కోసం మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను అందుబాటులో ఉంచుతామని సమీక్ష తర్వాత మంత్రి తలసాని తెలిపారు.
Fish Medicine : ఈ ఏడాది చేప ప్రసాదాన్ని జూన్ 9న పంపిణీ చేయనున్నారు. ప్రతి ఏటా జరిగే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంపై మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. కొత్త సచివాలయంలో మంగళవారం మంత్రి తలసానితో బత్తిన సోదరులు భేటీ అయ్యారు. చేప ప్రసాదం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తామని మంత్రి బత్తిన సోదరులకు ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాలు, దేశాల నుండి లక్షలాది మంది వస్తారని, ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తలసాని అన్నారు.
అందుబాటులో చేపపిల్లలు
అవసరమైన చేప పిల్లలను మత్స్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచుతామన్న మంత్రి తలసాని.. ఈ నెల 25న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అన్ని శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. జూన్ 9న ఉదయం 8 గంటల నుంచి 24 గంటల పాటు నిరంతరంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామని బత్తిన అమర్నాథ్ గౌడ్ చెప్పారు. ఏటా మృగశిరకార్తె సందర్బంగా ఆస్తమా బాధితులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. కరోనా మహమ్మారి కారణంగా గత 3 ఏళ్లుగా చేప ప్రసాదం పంపిణీ ఆగిపోయింది. అయితే ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీనితో ఎప్పటిలాగే బత్తిన బ్రదర్స్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉచితంగా చేప ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. అయితే ఈసారి జనం భారీగా తరలివచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ప్రతి సారి ఎన్ని వివాదాలొచ్చినా..చేప మందులో శాస్త్రీయత లేదని కోర్టులకు వెళ్ళినా సరే చేప మందు ప్రతి ఏటా పంపిణీ చేస్తూనే వచ్చారు.