ఐపీఎల్ ముగింపు దశకు వస్తున్న సమయంలో ధోని గుడ్ బై చెబుతాడన్న వార్తల నేపథ్యంలో ధోని గురించి హర్భజన్ తెలిపిన ఈ విషయం ఆసక్తి రేపింది.
DHONI IPL మహేంద్ర సింగ్ ధోనీ తన ఆటతీరుతో తన అభిమానులను అలరిస్తాడు. మరోపక్క సారధ్య బాధ్యతలు కూడా ఎంతో నేర్పుగా నిర్వహిస్తాడు. ఎంతో బ్యాలెన్స్ తో వ్యవహరిస్తాడు. భావోద్వేగానికి లోను కాకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. ఎంతో నిబ్బరంగా కనిపిస్తాడు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతాడు. ప్రత్యర్ధులను తన వ్యూహ ప్రతివ్యూహాలతో చిత్తుచేస్తాడు. ఓటమి అంచున ఉన్న మ్యాచులను గెలిపిస్తాడు. అటువంటి ధోనీ ఒకసారి బ్యాలెన్స్ తప్పాడు. భావోద్వేగానికి లోనయ్యాడు. కన్నీటి పర్యంతమయ్యాడు. భోరున విలపించాడు. వెక్కివెక్కి ఏడ్చేశాడు. తమ మనసులోని భాదను వ్యక్తపరిచాడు. ఈ సంఘటన 2018లో జరిగింది. అప్పటికి రెండేళ్ల క్రితం చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై వేటు పడింది. నిబంధనలు అతిక్రమించిన కారణంగా రెండేళ్ల పాటు నిషేధానికి గురయింది. తిరిగి 2018లో రీ ఎంట్రీ ఇచ్చింది.
2018లో చెన్నై జట్టు రీ ఎంట్రీ ఇచ్చే సమయంలో జట్టుయాజమాన్యం టీమ్ డిన్నర్ ఏర్పాటు చేసింది. ఏ సమయంలో ధోనీ భోరున ఏడ్చేశాడు. ఈ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న హర్భజన్ సింగ్, తాహిర్లు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవలే ముగిసిన ఓ ఐపీఎల్ కామెంటరీ చెబుతున్న సమయంలో హర్భజన్ ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నాడు. తాహిర్ కూడా ఆ రోజు జరిగిన విషయాలను గుర్తుచేసుకున్నాడు. ఆ ఏడాది హర్భజన్ సింగ్, తాహిర్ కూడా చెన్నై జట్టులో ఉన్నారు.
ధోనీ ఏడ్చిన విషయం ఎవ్వరికీ తెలియదని హర్భజన్ తెలిపాడు. తాను కూడా అక్కడే ఉన్నానని, ధోనీ ఆ రోజు ఎంతో భావోద్వేగానికి గురయ్యాడని తాహిర్ గుర్తుచేసుకున్నాడు. చెన్నై జట్టును ధోనీ తన కుటుంబంలా భావిస్తాడని తాహిర్ తెలిపాడు.
రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నై జట్టు 2018లో రీ ఎంట్రీ ఇచ్చిందని ఆ ఏడాది టోర్నీ విజేతగా నిలిచిందని తాహిర్ తెలిపాడు. జట్టులో అందరూ ముసలివాళ్లే ఉన్నారని తమపై కామెంట్లు వచ్చాయని, వాటన్నింటినీ తట్టుకుని ఆ ఏడాది టైటిల్ సాధించామని తాహిర్ వెల్లడించాడు