Sukhwinder Singh Sukhu: హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరంటే
Sukhwinder Singh Sukhu: హైడ్రామా నడుమ హిమాచల్ ప్రదేశ్ సీఎం ఎవరనేదానిపై క్లారిటీ వచ్చేసింది. పార్టీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సుఖ్విందర్ సింగ్ సుఖూను ముఖ్యమంత్రిగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఆయన పేరును అధికారికంగా ప్రకటించేసారు. నదౌన్ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సుఖ్విందర్ సింగ్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మొన్నటి ఫలితాల్లో 40 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీలో సీఎం పోస్ట్ కోసం రగడ మొదలైంది.
తాను కూడా సీఎం రేస్ లో ఉన్నానంటూ హిమాచల్ ప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. దీంతో ముఖ్యమంత్రి పదవి కోసం నేతల మధ్య పోటీ తీవ్రతరం అయింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన అధిష్టానం ఆ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపి సీఎంగా సుఖ్విందర్ సింగ్ సుఖూ పేరు ఫైనల్ చేసింది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ముకేశ్ అగ్నిహోత్రి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. సీఎం పదవి కోసం అటు బల ప్రదర్శన, ఇటు నిరసన చేసిన కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్.. చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తానని ప్రతిభ చెప్పారు. కాగా వీరభద్ర, ప్రతిభల కొడుకు విక్రమాదిత్య సింగ్‌కు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
1964 మార్చి 27న పుట్టిన సుఖ్విందర్ సింగ్ సుఖు.. ఎంఏ, ఎల్ఎల్‌బీ చదివారు. రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్ కొడుకై న సుఖు.. ఒకప్పుడు ఛోటా సిమ్లాలో పాల వ్యాపారం చేశారు. కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్ ఎన్‌ఎస్‌యూఐ నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. తర్వాత యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారు. హామిర్‌పూర్‌లోని నదైన్ నుంచి 2003లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2008లో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, 2013 నుంచి 2019 దాకా హెచ్‌పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఓ సామాన్య కార్యకర్తగా, విద్యార్థి నాయకుడుగా అంచలంచెలుగా నాయకుడు గా ఎదిగిన సుఖవీందర్ సింగ్ సుఖు నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.