కేసీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మోనార్క్. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా సరే.. ఎదురుగా వెళ్లి ఢీకొట్టి సవాల్ చేసే దమ్మూ, ధైర్యం కేసీఆర్ (KCR) సొంతం. వరుసగా రెండుసార్లు ఒంటిచేత్తో బీఆర్‌ఎస్‌ను (BRS) అధికారంలోకి తీసుకొచ్చి తన సత్తా చాటారు.
CM KCR : కేసీఆర్.. తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మోనార్క్. ప్రత్యర్థి ఎంతటి బలవంతుడైనా సరే.. ఎదురుగా వెళ్లి ఢీకొట్టి సవాల్ చేసే దమ్మూ, ధైర్యం కేసీఆర్ (KCR) సొంతం. వరుసగా రెండుసార్లు ఒంటిచేత్తో బీఆర్‌ఎస్‌ను (BRS) అధికారంలోకి తీసుకొచ్చి తన సత్తా చాటారు. ఇప్పుడు మళ్లీ మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. ఐతే.. గతంలో కేసీఆర్‌లో ఉన్న ఫైర్, ముక్కుసూటితనం ఇప్పుడు ఆయనలో కనిపించడం లేదు. దానికి వయసు మీదపడడం ఒక కారణమైతే.. సహజసిద్ధంగా ప్రజల్లో ఉండే వ్యతిరేకత కూడా మరో కారణంగా కనిపిస్తోంది. ఇంతకుముందు ఎవరైనా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినా, తిరుగుబాటు చేసినా.. ఎదురుతిరుగుతారనే ఆలోచన వచ్చినా సరే ఎంతటి పెద్ద నేతనైనా.. అంతకుమించి ఆర్థికంగా, రాజకీయంగా బలమున్నా సరే గడ్డిపోచలా తీసి పక్కనెట్టేసేవారు. కానీ ముచ్చటగా మూడోసారి ఎన్నికలు ఎదుర్కొంటున్న గులాబీ బాస్ తీరులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఐతే.. కేసీఆర్‌లో మార్పునకు కారణం భయమని కొందరు చెబుతుంటే.. మరికొందరేమో వ్యూహాత్మకమని అంటున్నారు.
అందరికంటే ముందుగానే అభ్యర్థుల జాబితా విడుదల చేసి.. ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు కేసీఆర్. ఈసారి కూడా 100 నుంచి 105 స్థానాల వరకూ గెలుస్తామని చాలా ధీమాగా చెబుతున్నారు. అందుకే వ్యూహాత్మకంగా అందరికంటే ముందుగా ఒకేసారి 115 మందితో అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించేశారు. ఐతే.. నియోజకవర్గాల్లో అసంతృప్తులు మీడియా ముందుకొచ్చి ఇష్టారాజ్యంగా మాట్లాడేస్తున్నారు. గతంలో అయితే.. కేసీఆర్ అసంతృప్త నేతలను పిలిచి క్లాస్ తీసుకునేవారు. కానీ.. ప్రస్తుతం కేసీఆర్ ఎందుకో ఆ విషయాలపై స్పందించాలన్నా.. వారిపై చర్యలు తీసుకోవాలన్నా ఆచితూచి అడుగులేస్తున్నారు.
బీఆర్ఎస్(BRS) అభ్యర్థులను ప్రకటించకముందే ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు(Mynampally Hanumanth Rao).. కేసీఆర్ కుటుంబ సభ్యుడు, మంత్రి హరీష్‌రావు (Harish Rao)పై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. అయినప్పటికీ మల్కాజిగిరి అభ్యర్థిగా ఆయన్నే గులాబీబాస్ ప్రకటించారు. మైనంపల్లి కుమారుడు రోహిత్‌కు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో మీడియా ముందే విమర్శలు గుప్పించారు. ఇంత జరిగినా సింపుల్‌గా ‘మైనంపల్లికి టికెట్ ఇచ్చాం.. పోటీ చేస్తారా లేదా అనేది ఆయనిష్టం’ అని కేసీఆర్ మిన్నకుండిపోయారు. టికెట్ ప్రకటించాక కూడా చాలానే జరిగాయి. అయినాసరే మైనంపల్లిపై చర్యలు తీసుకోవడానికి గులాబీ బాస్ ఎందుకో సాహసించట్లేదు. మల్కాజిగిరి నుంచి వేరొకర్ని బరిలోకి దింపడానికి కేసీఆర్ ప్రయత్నాలు షురూ చేశారని ప్రచారం జరిగినా అది కూడా ఇంతవరకూ కొలిక్కి రాలేదు.
ఖమ్మం జిల్లా కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswarao) గురించి ఇక ప్రత్యేకించి చెప్పడానికేమీ లేదు. పాలేరు నుంచి టికెట్ ఆశించినా సిట్టింగ్‌కే ఇచ్చారు గానీ.. ఆయన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. మాస్ లీడర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిచయాలు, పలుకుబడి ఉన్న నేత కావడంతో ఇక ఈ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకోవాలని వేలాది కార్లు.. అంతకుమించి బైకులతో అభిమానులు, అనుచరులు, కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి బలప్రదర్శన చేశారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో పోటీచేసి తీరుతానని.. అధిష్టానానికి సవాల్‌గా చెప్పారు. అయితే ఏ పార్టీ అనేది మాత్రం చెప్పలేదు. వాస్తవానికి.. ఇంత మాట అన్న తర్వాత ‘ప్రభుత్వానికే ఎదురు తిరగడమేంటి..?.. రెబల్‌గా మారి పోటీచేస్తానని ప్రకటన చేయడమేంటి.. ఉంటే ఉండు లేకుంటే వెళ్లిపో..?’ అని ఏ పార్టీ అధినేత అయినా అనే మాటలే. కానీ కేసీఆర్ మాత్రం ఎందుకో అస్సలు ఆ ఆలోచనే చేయట్లేదు. పైగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి తుమ్మలతో పాటు అసంతృప్తులందర్నీ ప్రగతి భవన్‌కు పిలిపించి బుజ్జగించే పనిలో నిమగ్నమయ్యారు.
ఇక పట్నం మహేందర్‌రెడ్డి (Patnam Mahender Reddy)విషయంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలు రావడం.. రేపో, మాపో రాజీనామా చేస్తారనే సంకేతాలు రావడంతో వెంటనే అలర్ట్ అయిన కేసీఆర్.. ఆయన మూడునాళ్ల ముచ్చటగా మంత్రి పదవి ఇచ్చి సేఫ్‌జోన్‌లో పెట్టారు. అంతేకాదు మరోవైపు.. కొడంగల్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పట్నం నరేందర్ రెడ్డికి కూడా టికెట్ ఇచ్చారు. ఇదే మునుపటి కేసీఆర్ అయితే ఎలాంటి నిర్ణయం తీసుకునేవారో.. ఏ రేంజ్‌లో కన్నెర్రజేసేవారో మాటల్లో చెప్పనక్కర్లేదేమో. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్నం బ్రదర్స్ కనీసం లేదంటే ఐదారు నియోజకవర్గాలను ప్రభావితం చేస్తారనే చర్చ జరుగుతోంది. అందుకే ఏదో ఒకటి చేసి పట్నంను కూల్ చేయాలని.. కేసీఆర్ ఇలా చేశారనే టాక్ కూడా నడుస్తోంది.
వేములవాడ టికెట్ ఎమ్మెల్యే చెన్నమనేనికి ఇవ్వలేదు. దీంతో ఆయన తిరుగుబాటుకు రంగం సిద్ధం చేసుకున్న సమయంలో.. ప్రగతి భవన్ నుంచి ఫోన్ వచ్చింది. పెద్ద సారు.. మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమించారన్నదే ఆ ఫోన్ కాల్ సారాంశం. చెన్నమనేని వ్యవసాయ శాస్త్రవేత్త కావడం, పైగా ప్రొఫెసర్ కూడా కావడంతో సలహాదారు పదవి ఇస్తున్నట్లు సీఎంవో ప్రకటన విడుదల చేసింది. ఇది కేబినెట్ హోదా కలిగిన పదవి కాగా.. ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు. వాస్తవానికి చెన్నమనేని తనకు టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేయడం.. కాంగ్రెస్‌లో చేరుతున్నారనే టాక్ నడవడంతో ఇంత పని జరుగుతోందా..? అని వెంటనే పదవి కట్టబెట్టారు కేసీఆర్.
ఇలాంటి ఘటనలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ చాలానే ఉన్నాయి. ఇక ఉద్యమాకారుల గురించి కేసీఆర్ పట్టించుకున్న పాపానే పోలేదు. తుమ్మల నుంచి మోత్కుపల్లి దాకా ఇదే తీరుగా ఉంది. సొంత పార్టీలోని మాజీలనూ పట్టించుకోకుండా.. ఆఖరికి జలగం వెంకట్రావు, వీరేశంలకు కూడా ఎమ్మెల్సీ పదవులు ఇస్తామంటూ బుజ్జగింపులు చేస్తున్న పరిస్థితి. గత రెండు పర్యాయాలు జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ ఏ ఒక్కర్నీ ప్రగతి భవన్‌కు ప్రత్యేకంగా పిలిపించుకొని మాట్లాడిన దాఖాలాలు లేవు. అయితే ఈసారి మాత్రం సీన్ మొత్తం మారిపోయింది.
ఇవన్నీ ఒక ఎత్తయితే.. గవర్నర్-గవర్నమెంట్ మధ్య నిన్న, మొన్నటి వరకూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పనక్కర్లేదు. సీన్ కట్ చేస్తే.. రాజ్‌భవన్‌కు కేసీఆర్ వెళ్లడం.. పట్నం ప్రమాణ స్వీకారం తర్వాత 25 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ కావడం.. ఆ తర్వాత సచివాలయంను సందర్శించడానికి గవర్నర్ తమిళిసైని ఆహ్వానించడం జరిగింది. కేసీఆర్ సహా మంత్రులు, సీఎస్ తదితరులు ప్రధాన ద్వారం వరకూ వచ్చి పూల బొకేలు ఇచ్చి స్వాగతించారు. అనంతరం తమిళిసైని సీఎం సచివాలయం లోపలికి తోడ్కొని వెళ్లారు. ఆమెను ఒక్కో ఫ్లోర్‌కు తీసుకెళ్లారు. అక్కడి గదులను చూపిస్తూ సచివాలయ నిర్మాణ వైభవాలను వివరించారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకూ ఉప్పు-నిప్పులా ఉన్న ముఖ్యమంత్రి, గవర్నర్ మధ్య సయోధ్య కుదిరిందనే వాదనకు తాజా పరిణామంతో బలం చేకూరిందని రాజకీయ వర్గాలు విశ్లేషించాయి. తాజా పరిణామాలతో రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్న బిల్లులన్నింటికీ ఇక మోక్షం కలగనుందన్న చర్చ మొదలైంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన వారికి కూడా త్వరలోనే మార్గం సుగమం కానుందని బీఆర్‌ఎస్ వర్గాలు వివరిస్తున్నాయి. ఎన్నికల ముందు కేసీఆర్ ఈ రేంజ్‌లో ట్విస్ట్ ఇస్తారని ఎవరూ ఊహించి ఉండరేమో.
మొత్తానికి మునుపటి కేసీఆర్.. ఇప్పటి కేసీఆర్ వేరు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. అసలే ఎన్నికల సమయం కాబట్టి ఏం మాట్లాడినా.. ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితులు వేరేగా ఉంటాయని పసిగట్టిన కేసీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకాస్త సమయం ఉండగానే పరిస్థితులు ఇలా ఉన్నాయంటే.. మున్ముందు ఇంకెన్ని పరిణామాలను చూడాల్సి వస్తుందోనని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఎన్నికలని తగ్గుతున్నారో.. లేకుంటే ఓటమి భయంతో ఇవన్నీ చేస్తున్నారో తెలియాలంటే మాత్రం ఇంకొన్నిరోజులు వేచి చూడక తప్పదు.