మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో జగన్ కీలక అంశాలపై అటో ఇటో తేల్చుకోనున్నారు. ఢిల్లీ పెద్దలతో జగన్ వరుస భేటీల తర్వాత రాష్ర్ట రాజకీయాలు కొత్త మలుపు తీసుకునే అవకాశాలూ లేకపోలేదు.
CM JAGAN DELHI TOUR : ఏపీ సీఎం జగన్ మూడు రోజుల ఢిల్లీ పర్యటన ఆసక్తిగా మారింది. విపక్షాలన్నీ పొత్తులు కుదుర్చుకుని అధికార పక్షాన్ని ఓడించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జగన్ పార్టీ అలర్టయింది. రాజమండ్రిలో జరిగే టీడీపీ మహానాడులో పొత్తులపై క్లారిటీ రావటంతో పాటు.. టీడీపీ వ్యూహమేమిటో ఖరారవనున్ననేపథ్యంలో అప్రమత్తమైన వైసీపీ ప్రతి వ్యూహాలు పన్నేందుకు సిద్ధమైంది. మూడు రోజుల పర్యటనలో 27న సీఎం జగన్ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు.28న పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభ వేడుకలకు హాజరవుతారు. అయితే ఈ రెండిటితో పాటు ముఖ్యమైన పలు అంశాలపై జగన్ క్లారిటీ తీసుకునే అవకాశాలుకనిపిస్తున్నాయి. శనివారం నీతి అయోగ్ సమావేశం ముగిసిన అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తోను జగన్ సమావేశం అవుతారు .కేంద్రం నుంచి రాష్ట్రానికి అందించాల్సిన సాయం పైన జగన్ చర్చించనున్నారు.
కేంద్రానికి మద్దతు ఇవ్వటం దేనికి సంకేతం
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభ వేడుకలను దాదాపుగా ప్రధాన ప్రతిపక్షాలన్నీ బహిష్కరించాయి. అయితే ఈ సమయంలో జగన్ చేసిన ప్రకటన ఆసక్తిగా మారింది. కేంద్రానికి మద్దతుగా నిలవడం, దానికి ప్రధాని అభినందనలు తెలపడం వెనుక రాజకీయ వ్యూహం లేకపోలేదని విశ్లేషకుల అభిప్రాయం. రాష్ట్రంలో బిజెపి వైసిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఇంత వరకూ జగన్ నోరు మెదపలేదు. ఆ పార్టీని, ఆ పార్టీ నేతలను వైసీపీ లీడర్లు ఎవరూ విమర్శించలేదు. కేంద్ర బిజెపి పెద్దలు మాత్రం జగన్ ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ముందు ముందు ఎలా?
ఈ నేపథ్యంలో మునుముందు ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న అంశంపై సీఎం జగన్ కు ఈ పర్యటనలో స్పష్టత వచ్చే అవకాశముంది. కేంద్రంతోనూ ఢిల్లీ బీజేపీ పెద్దలతోనూ
ఆయన సంప్రదింపుల సారాంశం ఇదే కావచ్చని తెలుస్తోంది. ఈ మధ్య అడిగీ అడక్కుండానే నిధుల వరాలు కురిపించిన మోడీ ఈ సారి కూడా జగన్ వినతులన్నీ ఓపిగ్గా వినబోతున్నారని
ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.