శరీరంలో కొవ్వు అధికంగా చేరితే గుండెపోటు సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
Cholesterol: మన శరీరానికి కొంత కొవ్వు (Cholesterol) అవసరం. అంతకుమించి కొవ్వు పేరుకుపోవడం మొదలైతే అది కొలెస్ట్రాల్ రూపంలో రక్తనాళాల్లో (Blood Vessels) చేరుతుంది. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలు (Health Problems) వస్తాయి. ముఖ్యంగా గుండెపోటు (Heart Attack) వంటి హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. శరీరంలో కొవ్వు అధికంగా చేరితే హార్మోన్ ఉత్పత్తులు కూడా మారిపోతాయి. అందుకే శరీరంలో అవసరానికి మించి కొలెస్ట్రాల్ ఉండకూడదు. కరిగించుకోవాలంటే కొన్ని రకాల ఆహార కాంబినేషన్లు ప్రయత్నించండి. వీటిని కలిపి తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోయే అవకాశం ఎక్కువ.
గ్రీన్ టీలో నిమ్మరసం
ప్రతిరోజూ ఉదయం పరగడుపున గ్రీన్ టీ చేసుకొని అందులో కాస్త నిమ్మరసం పిండుకొని తాగండి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇక నిమ్మకాయలో కొలెస్ట్రాల్ తగ్గించే ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగే అవకాశం ఎక్కువ. అలాగే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.
వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి
వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి కొంచెం కూరలా వండుకొని అప్పుడప్పుడు తింటూ ఉండండి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. వెల్లుల్లిలో అల్లిసన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ పై తీవ్రంగా ప్రభావాన్ని చూపిస్తుంది. ఉల్లిపాయలో కూడా ఉండే ఫ్లేవనాయిడ్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతాయి. ఈ రెండు కలిపితే రుచి కూడా అదిరిపోతుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి కొంచెం కూరలా వండుకొని అప్పుడప్పుడు తింటూ ఉండండి.
పెరుగులో బాదం పలుకులు
బాదంపప్పు రాత్రి పూట కాస్త పెరుగులో వేసి వదిలేయండి. ఉదయం లేచాక వాటిని తినండి. పెరుగును కూడా తినేయండి. బాదంపప్పులో గుండెకు వచ్చే అవసరమైన మంచి కొవ్వు ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థానంలో మంచి కొవ్వు పేరుకుంటుంది. పెరుగు తినడం వల్ల కొలెస్ట్రాల్ నాలుగు శాతం వరకు తగ్గుతుందని ఇంతకుముందే అధ్యయనాలు వెల్లడించాయి. పెరుగులో ప్రొబయోటిక్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పప్పుతో బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ కేవలం మధుమేహం ఉన్నవారు మాత్రమే తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ బ్రౌన్ రైస్ ఎవరు తిన్నా ఆరోగ్యమే. ఇక పప్పు తెలుగు ఇళ్లల్లో కచ్చితంగా ఉండాల్సిన పదార్థం. బ్రౌన్ రైస్‌తో పప్పును తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ రెండు కలిపి తింటే పోషకాలు కూడా పుష్కలంగా అందుతాయి. బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్ వంటివి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే బియ్యం రకాలు. ఇవి మధుమేహలకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. వీటిలో ఫైబర్, ఫైటో న్యూట్రియెంట్లు, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.