2050 నాటికి 80 కోట్ల మందికి వెన్నునొప్పి బారిన పడబోతున్నారు . అవును నిజమే ప్రముఖ జర్నల్ లాన్సెట్ ఈ విస్తుపోయే కథనాన్ని ఈ నెల ప్రచురించింది.. వృద్ధాప్యం ప్రపంచ వ్యాప్తంగా పెరగడమే కాకుండా అనేక కారణాలను కూడా విశ్లేషించింది
BACK PAIN : ఆరోగ్యమే మహాభాగ్యం.. ఆరోగ్యంపై అవగాహన అంతకంతకూ పెరుగుతున్న రోజులివి. అయితే రకరకాల వ్యాధులు ఏదో రూపంలో జనాల్ని భయపెడుతూనే ఉన్నాయి. అనేక రూపాలు సంతరించుకుంటూ కొత్త రోగాలు వెంటాడుతున్న కాలంలో మరిన్ని జాగ్రతలు తీసుకుంటే తప్ప ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది. కొత్త రోగాలు ఓ వైపు తరుముతుంటే పాత రోగాలు కూడా జనాన్ని మరింత వేదించటం మొదలుపెట్టాయి… తాజాగా 2050 నాటికి 800 మిలియన్లకు పైగా ప్రజలు నడుము నొప్పితో బాధపడుతారని లాన్సెట్ రుమటాలజీ జర్నల్లో ప్రచురించింది. 2020తో పోలిస్తే 36 శాతం అధిక కేసులు నమోదవుతాయని వివరించింది. 2017 నుంచి వెన్నునొప్పి కేసుల సంఖ్య చాలా తక్కువ ఉండేదని, ఇప్పుడు దాని కంటే అర బిలియన్ కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయని తెలిపింది. 2020లో సుమారు 619 మిలియన్ల వెన్నునొప్పి కేసులు నమోదైనట్టు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ 2021 ఓ అధ్యయనంలో పేర్కొంది.
ఆసియా, ఆఫ్రికా దేశాలు టాప్
వెన్నునొప్పి కేసులు రోజురోజుకూ పెరుగుతుండగా.. వెన్నునొప్పి కేసులలో ఆసియా, ఆఫ్రికా ముందంజలో ఉన్నాయని సిడ్నీ విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. 1990 నుంచి 2020 వరకు 204 దేశాల నుంచి వచ్చిన డేటా ఆధారంగా, వెన్నునొప్పి కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తోంది, 2050 నాటికి 843 మిలియన్ల మంది జనాభా వృద్ధాప్యం, వెన్ను నొప్పి కారణంగా ఈ పరిస్థితికి గురవుతారని సమాచారం.
రోగాలన్నిటికీ అదే మూలం
ప్రపంచంలో వైకల్యానికి ప్రధాన కారణం నడుము నొప్పి. సరైన చర్య తీసుకోకపోతే, నడుము నొప్పి మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు, మానసిక అనారోగ్య పరిస్థితులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులకు వెన్నునొప్పే ప్రకధాన సమస్యగా మారుతుందని పరిశోధకులు తెలిపారు. వెన్నునొప్పితో బాధపడేవారిలో కనీసం మూడింట ఒక వంతు వృత్తిపరమైన కారకాలు, ధూమపానం, అధిక బరువుకు కారణమని అధ్యయనం తెలిపింది.
ఆడవారిలోనే అధికం…
మగవారితో పోలిస్తే ఆడవారిలో నడుము నొప్పి కేసులు కూడా ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. సాధారణంగా ఈ వెన్నునొప్పి ఎక్కువగా పని చేసే వయస్సులో ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది. కానీ వృద్ధులలో నడుము నొప్పి ఎక్కువగా వస్తుందని అధ్యయనం తేల్చింది.