భయం వేయడం సహజం. కానీ అది ఎల్ల వేళలా వేస్తుంటే మాత్రం వైద్యులను కలవాల్సిందే.
Anxiety Disorder: కొత్త ప్రదేశాలకు (New Places) వెళ్లినప్పుడు, కొత్త వారితో మాట్లాడినప్పుడు, బాస్ ముందు కూర్చున్నప్పుడు ఒత్తిడి (Stress) కలగడం సహజం. ఆ ఒత్తిడి వల్ల కాస్త భయం (Fear) కలుగుతుంది. అలా కాకుండా చిన్న చిన్న విషయాలకే భయం, కంగారూ, ఆందోళన వంటివి కలుగుతుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఇవి ‘జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్’ (Generalized Anxiety Disorder)లక్షణాలు. ఇది ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య. ఈ సమస్య బారిన పడిన వారి సాధారణ జీవితం కూడా ప్రభావితం అవుతుంది. ఉదయం లేచిన వెంటనే ఎలాంటి కారణం లేకుండానే చిన్న భయం మొదలవుతుంది. ఆందోళనగా అనిపిస్తుంది. పిల్లలు స్కూలు నుంచి రావడం కాస్త ఆలస్యమైనా, పరీక్షలు రాయడానికి వెళుతున్నా, ఇంటి పక్క వారితో చిన్న మనస్పర్ధలు వచ్చినా… ఇలాంటివి వారిని చాలా ప్రభావితం చేస్తాయి. మళ్లీ గొడవలు అవుతాయేమో, పిల్లలకు ఏమైనా అవుతుందేమో అని భయపడుతూనే ఉంటారు. మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది.
పానిక్ అటాక్స్…
మానసిక ఆందోళన మీర ఎక్కువైనప్పుడు కాసేపు పానిక్ అటాక్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే భయం అధికంగా వచ్చేస్తుంది. ఆ సమయంలో శరీరమంతా బలహీనంగా మారిపోతుంది. ఏ పని చేయలేరు. తాము చనిపోతామేమో అన్నంతగా వారికి భయం వేస్తుంది. శ్వాస అందదు. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఛాతీలో నొప్పి వస్తుంది. అర్జెంటుగా బాత్రూమ్ కు వెళ్లాల్సి వస్తుంది. మరికొంతమంది తమకు గుండె పోటు వచ్చినట్టు ఫీలవుతారు.
ఎందుకు వస్తుంది?
ఇది 30ల వయసులో మొదలవుతుంది. ఎక్కువగా ఆడవారిలో ఇది వచ్చే అవకాశం ఉంది. ఇది వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. అంటే తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సోకే అవకాశం ఉంది. మెదడులో భావోద్వేగాలను నియంత్రించే భాగం అమిగ్ధల. ఇది గాబా ఎర్జిక్ అనే నాడీ కణాలను ప్రేరేపిస్తుంది. ఆ కణాలు మానసిక ఆందోళన తగ్గేందుకు సహకరిస్తుంది. ఇలా ప్రేరేపించే శక్తి తగ్గినప్పుడు ఆ కణాలు ఉత్పత్తి కావు. అలాంటప్పుడు ఒత్తిడి అధికమై ఆందోళన పెరిగిపోతుంది.
చికిత్స అవసరం
దీన్ని తమకు తాముగా తగ్గించుకోవాలనుకుంటారు చాలా మంది. కానీ అది సాధ్యం కాదు. కచ్చితంగా మందులు వాడాలి. అలాగే వారికి కుటుంబసభ్యులు కూడా అండగా నిలబడాలి. గుండె దడ, నిద్రలేమి, రెస్ట్ లెస్నెస్ వంటి లక్షణాలు తగ్గడానికి మందులను సూచిస్తారు.