Amazon: కొంప ముంచిన నకిలీగాళ్లు.. కోట్ల నష్టంతో కోర్టుకు
Amazon sues Facebook group admins: ఇప్పుడు ప్రపంచం అంతా మన చేతిలోకి వచ్చేసింది. ఒక్క క్లిక్కుతో ఏదైనా ఇంటికి రప్పించుకోవచ్చు. ఆన్లైన్ షాపింగ్‌కు అలవాటు పడ్డా ఏదైనా వస్తువు కొనాలంటే ఆ వస్తువులను కొనే ముందు కస్టమర్ల రివ్యూలు చదువుతున్నారు. అందులో ఎవరైనా ఆ ప్రొడక్ట్ గురించి బాగోలేదని రివ్యూ ఇస్తే ఆ ప్రొడక్ట్‌ను వదిలేసి, వేరు ప్రొడక్ట్ చూడడానికి వెళ్లారు. అయితే కొందరు పెట్టే నకిలీ రివ్యూలతో అమెజాన్‌కు భారీ నష్టం వాటిల్లిందట. ఇలా ఎందుకు జరిగిందనే కారణంగా ఆరా తీసిన అమెజాన్‌కు షాకింగ్ విషయాలు తెలిశాయి. కొందరు నకిలీ ఫేస్ బుక్ పేజీలు సృష్టించి, వాటి ద్వారా తప్పుడు రివ్యూలు పెట్టినట్లు గుర్తించింది.
ఈ క్రమంలో అమెజాన్ సంస్థ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమకు జరిగిన నష్టం పూర్చాలని కోరుతూ పై కోర్టులో పిటిషన్ వేసింది. నకిలీ రివ్యూలతో నష్టాలు రావడంతో 10 వేల ఫేస్ బుక్ పేజీల అడ్మిన్లపై అమెజాన్ కోర్టుకెళ్లింది. సోమవారం కోర్టులో వారిపై దావా వేసింది. గ్లోబల్ గ్రూప్‌లు, నకిలీ రివ్యూయర్లను నియమించుకుని ఇలా చేసినట్లు వెల్లడించింది. ఆ ఫేస్ బుక్ నకిలీ రివ్యూలు అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, జపాన్ మరియు ఇటలీలో అమెజాన్ ఆన్లైన్ స్టోర్ ఫ్రంట్లలో నిర్వహిస్తున్నారని వెల్లడించింది. 2015 నుండి తమ సంస్థలోని ప్రొడక్టులపై నకిలీ రివ్యూలు ఇస్తున్నారని పేర్కొంది. అంతేకాదు 2022లో ఫేస్ బుక్ ఓ నకిలీ గ్రూపును బ్యాన్ చేసింది, అలా తొలగించిన గ్రూప్ లో 40 వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దానికి “Amazon Product Review” అని పేరు పెట్టడంతో అమెజాన్ సంస్థే తమ వస్తువులపై రివ్యూ ఇచ్చినట్లు కొందరు భావించారు.