Kejriwal Residence: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ఆప్ ప్రభుత్వ నిర్ణయాలే లక్ష్యంగా ఇప్పుడు జాతీయ రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి ఆధునీకరణకు రూ 52.71 కోట్ల ఖర్చు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఇంత భారీ మొత్తంలో ఖర్యు చేయటం ఆప్.. బీజేపీ మధ్య మరో రచ్చకు కారణమవుతోంది. తన ఇంటి కోసం ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. దీనికి ఆప్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇది కొనసాగుతున్న సమయంలో ఢిల్లీ విజిలెన్స్ డైరెక్టరేట్ లెఫ్టినెంట్ గవర్నర్ కు ఇచ్చిన నివేదకతో ఈ వ్యవహారం కొత్త మలుపు తీసుకుంది. ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ నివసిస్తున్న బంగళా ఆధునికీకరణ కోసం రూ.52.7 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కేజ్రీవాల్ ఇంటి చుట్టూ నాలుగు భవనాలు ఉన్నాయని, వాటిలో 22 మంది అధికారులు ఉండేవారని రాజకీయ ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. కేజ్రీవాల్ బంగళా ఆధునికీకరణ ప్రారంభం కాగానే, ఈ అధికారుల ఇళ్లను ఖాళీ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ అధికారుల కోసం 21 టైప్-5 ఫ్లాట్లను రూ.6 కోట్ల చొప్పున కామన్వెల్త్ విలేజ్లో కొన్నారని ఫిర్యాదులు ఉన్నాయి. ఈ మొత్తం సొమ్మును రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించారని బీజేపీ, కొందరు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ మాస్టర్ప్లాన్ను తుంగలో తొక్కారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. దీనిపై తాను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు ఫిర్యాదు చేస్తానని ఆ పార్టీ నేతలు స్పష్టం చేసారు. కేజ్రీవాల్ బంగళా ఒక అంతస్థు గల భవనమని వివరించిన నేతలు..20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్థులను నిర్మిస్తున్నారన్నారని వివరించారు. ఇది ఢిల్లీ వారసత్వ సంపదకు విఘాతం కలిగించటమేనని ఆరోపిస్తున్నారు. నిజాయితీ, సింప్లిసిటీ అంటూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అరవింద్ కేజ్రీవాల్ తన వాగ్దానాలను తప్పుతున్నారని, మోసం చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. కంఫర్ట్, విలాసాలపై ఆయనకు కాంక్ష ఎక్కువ బీజేపీ నేత బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా విమర్శించారు. కేజ్రీవాల్ ఇంటికి వియత్నాం నుంచి ఖరీదైన మార్బుల్స్, ప్రీ-ఫాబ్రికేటెడ్ ఉడెన్ వాల్స్, కర్టన్లు తెప్పించారని ఆరోపించారు. ఈ ఒక్కో కర్టన్ ధర రూ.7.94లక్షలుగా పేర్కొన్నారు.
ఇప్పుడు ఈ వ్యవహారం పైన ఢిల్లీ విజిలెన్స్ డైరెక్టరేట్ నివేదిక సమర్పించింది. రూ 33.49కోట్లను ఇంటి నిర్మాణానికి, రూ 19.22 కోట్లను క్యాంపు కార్యాలయానికి ఖర్చు చేసినట్లు నివేదిక ఇచ్చింది. కేజ్రీవాల్ ఇంటి ఆధునీకరణలో నిబంధనలకు విరుద్దంగా అధిక వ్యయం చేసారని, అధికార దుర్వినియోగం ఆరోపణలపైన పూర్తి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. తాజాగా విలిజెన్స్ సమర్పించిన నివేదిక ప్రకారం ఈ నివాసం 1942-43 కాలంలో నిర్మాణం చేసింది కావటంతో పూర్తిగా తొలిగించాల్సి వచ్చిందని ప్రజా పనుల విభాగం వెల్లడించింది. తొలుత రూ 15 కోట్ల నుంచి రూ 20 కోట్లకు టెండర్ పనులను పూర్తి చేయాలని భావించి..రూ 8.61 కోట్లకు టెండర్లను పిలిచిందని వివరించింది.
ఆ తరువాత కొత్త ప్రతిపాదనలు..అదనపు హంగులు తోడవటంతో అంచనా పెరిగిందని నివేదికలో స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ నివేదిక పైన గవర్నర్ నిర్ణయం ఏంటనేది తెలియాల్సి ఉంది. గవర్నర్ నిర్ణయం ఆధారంగా తదుపరి చర్యలకు ఆప్ ప్రభుత్వం నిర్ణయించే అవకాశం ఉంది. తాజాగా కేజ్రీవాల్ ఇంటి పైన కొనసాగుతున్న రచ్చపై రానున్న రోజల్లో కొత్త రాజకీయం మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.