తెలుగుదేశం మహానాడుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.. ఒక రకంగా మేనిఫెస్టో లో ముఖ్య అంశాలు బయటకు చెప్పే అవకాశం ఈ మహానాడులో ఉండొచ్చు అని తెలుస్తోంది.
TDP MAHANAADU AT RAJAMUNDRY :తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా ఏటా నిర్వహించే మహానాడుకు ఈ సారి రాజమండ్రి వేదికైంది. రాజమహేంద్రవరం వద్దనున్న వేమగిరిలో పార్టీ పండుగమహానాడు నిర్వహణకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ నెల 27, 28 తేదీల్లో రెండు రోజుల పాటు మహానాడును వేమగిరి ప్రాంగణంలో నిర్వహిస్తారు.
ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కనివినీ ఎరగని రీతిలో రాజమండ్రిలో మహానాడు నిర్వహణ ఏర్పాట్లను టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికలకు ముందు జరగనున్న ఈ మహానాడు టీడీపీకి అత్యంత కీలకం కాబోతుంది. ముఖ్యంగా రాజకీయంగా పొత్తులు కీలకంగా మారుతున్న నేపథ్యంలో జనసేన, బీజేపీతో కలిసి ఎలా ముందుకు సాగాలన్నది మహానాడులోనే నిర్ణయించే అవకాశాలున్నాయి.
పొత్తులు తేల్చేస్తారా?
ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో విపక్ష టీడీపీ కీలక రాజకీయ నిర్ణయాలకు సిద్ధమవుతోంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సమర శంఖం పూరించేందుకు సిద్దమయ్యారు. పొత్తుతో పాటుగా మహానాడు వేదికగా మేనిఫెస్టో ప్రకటనకు రంగం సిద్దమైంది. ఎన్నికల ముందు జరుగుతున్న రాజమండ్రిలో నిర్వహిస్తున్న మహానాడు ద్వారా చంద్రబాబు కీలక ప్రకటనలు చేయనున్నారు. ఇక పవన్ తో కలిసి కామన్ అజెండా ప్రకటనకు ముహూర్తం సిద్దం చేసారు. జనసేనాని పవన్ ప్రకటనతో పొత్తులు, సీట్ల పంపకాలు, సీఎం సీటు విషయంలోనూ దాదాపు క్లారిటీ వచ్చేసింది. దీంతో మహానాడులో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుని ప్రకటించేందుకు చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు. కలిసొస్తే బీజేపీని కూడా కలుపుకుని, లేదంటే జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు ప్రకటించే అవకాశాలు స్పస్టంగా ఉన్నాయి.
రాజమండ్రిలో సిద్దమైన మహానాడు వేదిక
ఎన్నికల మేనిఫెస్టో…
వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధాన అంశాలను మహా నాడు వేదికగా చంద్రబాబు ప్రకటించనున్నారు. 26న మహానాడు కోసం రాజమండ్రికి చంద్రబాబు చేరుకోనున్నారు. అదే రోజు సాయంత్రం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేశారు. మహానాడులో ప్రవేశ పెట్టే 15 తీర్మానాలను పోలిట్ బ్యూరో సమావేశంలో ఆమోదిస్తారు.
రాజమండ్రి నగరంలో మహానాడు సందడి
భారీగా చేరికలు
ఈ సారి మహానాడు వేదికగా పార్టీలో భారీగా చేరికలుంటాయని నేతలు చెబుతున్నారు. మహానాడు వేదికగా గతంలో పార్టీ వీడి ఇతర పార్టీల్లో చేరిన ముఖ్య నేతలు..అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అధికారికంగా టీడీపీ కండువా కప్పుకుంటారని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది.
జగన్ కు కౌంటర్
ముఖ్యమంత్రి జగన్ సంక్షేమం తో పాటుగా సామాజిక న్యాయం గురించి పదే పదే ప్రస్తావిస్తున్న సమయంలో చంద్రబాబు దీనిని కౌంటర్ చేస్తూ తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమంతో పాటుగా సామాజిక వర్గాల వారీగా అందిచే మేలు గురించి ప్రధాన అంశాలను వెల్లడించనున్నారు.
15 నిర్వాహక కమిటీలు
ఈసారి టీడీపీ మహానాడు నిర్వహణకు 15 కమిటీల్ని ఏర్పాటు చేశారు. మహానాడు ఆహ్వానాల కమిటీలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తో పాటు పలువురు సభ్యులుగా ఉన్నారు. తీర్మానాల కమిటీలో యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్.ఏ.షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి వంటి సీనియర్ నాయకుల్ని నియమించారు. అన్ని కమిటీల్లో కలిపి మొత్తం 200 మంది సభ్యులున్నారు.
భద్రత కల్పించండి…
మరో వైపు… మహానాడుకు భద్రత కల్పించాలని కోరుతూ ఏపీ డీజీపీకి టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మహానాడుకు లక్షలాదిమంది ప్రజలు హాజరవ్వనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంచిత సంఘటనలు చోటుచేసుకోకుండా తగింత పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయాయని కోరారు. సాధారణ ప్రజలకు ఎటువంటి ట్రాపిక్ ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రజలు మహానాడు కోసం వచ్చే వారికి అద్దె బస్సులు ఏర్పాటు చేయాల్సిందింగా డిపో మేనేజర్లకు ఆదేశాలు జారీ చేయాలని ఆర్.టి.సి ఎండీని అచ్చెన్నాయుడు మరో లేఖలో కోరారు.