ఐపీఎల్ ఫైనల్స్ కు చేరాలన్న ముంబై ఆశలు గల్లంతయ్యాయి. క్వాలిఫయింగ్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ముంబై ఓడిపోయింది
IPL : డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ 62 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ విజయంతో వరుసగా రెండో ఏడాది టైటిల్ పోరులో నిలిచింది. వర్షంతో ఆలస్యంగా మొదలైన మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ప్రారంభించింది. టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(60 బంతుల్లో 129, 7ఫోర్లు, 10 సిక్స్‌లు) ఆరంభం నుంచే దూకుడైన ఆటతీరు కనబరిచాడు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ బౌండరీలతో విరుచుకుపడ్డాడు.
చెలరేగిన గిల్
గిల్ ఎడపెడా ఫోర్లు, సిక్స్‌లు బాదడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 233/3 భారీ స్కోరు చేసింది. సాయి సుదర్శన్(43, రిటైర్డ్ హర్ట్) ఆకట్టుకున్నాడు. ఈ సీజన్లో గిల్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఆకాశ్ మద్వాల్, పీయూశ్ చావ్లా ఒక్కో వికెట్ తీసుకున్నారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్(38 బంతుల్లో 61, 7ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్‌వర్మ(14 బంతుల్లో 43, 5ఫోర్లు, 3 సిక్స్‌లు) మినహా ఎవరూ అంతగా రాణించలేకపోయారు. మోహిత్‌శర్మ(5/10) ఐదు వికెట్లతో చెలరేగగా, షమీ(2/41), రషీద్‌ఖాన్(2/33) ముంబై పతనంలో కీలకమయ్యారు. సుడిగాలి ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన గిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈ నెల 28న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.
సంక్షిప్త స్కోర్లు
గుజరాత్: 20 ఓవర్లలో 233/3(గిల్ 129, సుదర్శన్ 43, పియూశ్ చావ్లా 1/45, ఆకాశ్ 1/52),
ముంబై: 18.2 ఓవర్లలో 171 ఆలౌట్(సూర్యకుమార్ 61, తిలక్‌వర్మ 43, మోహిత్‌శర్మ 5/10, రషీద్‌ఖాన్ 2/33)