Zelensky Sensational Comments on Putin: అనుచరుల చేతుల్లోనే పుతిన్ చావు తప్పదు
Zelensky Sensational Comments on Putin: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. ఈ యుద్ధం మొదలయ్యి ఏడాది పూర్తైనా ఇప్పటికీ యుద్ధం కొనసాగిస్తున్నారు. పశ్చిమ, యూరప్ దేశాల నుండి ఆయుధ సామాగ్రి అందుతుండటంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. నాటో దేశాల నుండి ఆయుధాలు అందించినంత కాలం తాము కూడా యుద్ధం కొనసాగిస్తామని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది. అవసరమైతే అణు యుద్ధానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ ఇప్పటికే తీవ్రంగా నష్టపోయింది. ఎప్పటివరకు కోలుకుంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపుతున్నాయి.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఆయన అనుచరులే చంపేస్తారని వ్యాఖ్యానించారు. రష్యా ప్రెసిడెంట్ నైతిక స్థైర్యం దెబ్బతినేలా జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సొంతవాళ్ల చేతుల్లోనే ఆయన చావు తప్పదని చెప్పడంతో రష్యా మరింత అప్రమత్తమైంది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలయ్యి ఏడాది పూర్తైన సందర్భంగా న్యూస్ వీక్ పత్రిక ప్రచురించిన కథనాల్లో వీటిని ప్రస్తావించింది. ఇప్పటికే ఉక్రెయిన్, అమెరికా, యూరప్‌పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న పుతిన్, మరింత రెచ్చిపోవడం ఖాయమని అంతర్జాతీయ నిపుణులు అంచన వేస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చలంటూనే మరోవైపు జెలెన్‌స్కీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు.