సౌత్ కొరియా నూతన అధ్యక్షుడిగా యూన్ ప్రమాణస్వీకారం… ఆసక్తిగా గమనిస్తున్న నార్త్ కొరియా..
దక్షిణ కొరియా నూతన అధ్యక్షుడిగా యూన్ సుక్ యోల్ ప్రమాణస్వీకారం చేశారు. మార్చి లో జరిగిన ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ విజయం సాధించింది. మాజీ న్యాయవాది అయిన యూన్ ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్, ఆమె భర్త, చైనా వైస్ ప్రెసిడెంట్, జపాన్ ప్రధాని తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 40 వేల మందిని కన్సర్వేటివ్ పార్టీ ఆహ్వానించింది.
ప్రమాణస్వీకారం అనంతరం యూన్ కీలక ప్రసంగం చేశారు. ప్రమాదకరంగా మారిన పొరుగుదేశమైన ఉత్తర కొరియాతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉత్తర కొరియా వరసగా చేస్తున్న క్షిపణి ప్రయోగాలపై ఆందోళనను వ్యక్తం చేశారు. ఫ్రీడమ్, మార్కెట్, ఫెయిర్ నెస్ వంటి అంశాలపై ప్రసంగించారు. ఇక ఇదిలా ఉంటే, దక్షిణ కొరియా రాజకీయాలను ఉత్తర కొరియా ఆసక్తిగా గమనిస్తున్నది. తమ దేశ భద్రత విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఇప్పటికే నార్త్ కొరియా హెచ్చరించింది. యూన్ పాలనలో అయినా రెండు దేశాల మధ్య సయోధ్య నెలకొంటుందా చూడాలి.