శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక కొత్త ప్రధానిగా యునైటెడ్ నేషనల్ పార్టీ అధినేత రణిల్ విక్రమసింఘే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. బుధవారం, శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేశంలో త్వరలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుందని, కొత్త ప్రధాని పదవిలోకి వస్తారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రణిల్ విక్రమసింఘే దేశ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్నన్నారు. ఇప్పుడు ఆయన ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడం ఆయనకు అంత సులభం కాదు. గతంలో 4 సార్లు శ్రీలంక ప్రధానిగా పనిచేసిన రణిల్ విక్రమసింఘే తన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ పునర్నిర్మాణానికి శాయశక్తులా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
రణిల్ విక్రమసింఘే మార్చి 24, 1949లో శ్రీలంకలోని కొలంబోలో ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి ఎస్మండ్ విక్రమసింఘే వృత్తి రీత్యా న్యాయవాది. రణిల్ కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ శ్రీలంకలో సిలోన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. లా స్టడీ పూర్తి చేసి 70వ దశకంలో రాజకీయాల్లోకి వచ్చారు. అఆయన యునైటెడ్ నేషనల్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1977లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఉప మంత్రిగా చేశారు. ఆ తరువాత, యువజన మరియు ఉపాధి మంత్రిత్వ శాఖతో సహా అనేక మంత్రిత్వ శాఖలకు మంత్రిగా పని చేసే అవకాశం వచ్చింది.
ఇక మే 7, 1993న రణిల్ తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రణిల్ తన రాజకీయ జీవితంలో నాలుగు సార్లు శ్రీలంక ప్రధానిగా ఉన్నారు. రణిల్ చివరిసారిగా 2019 నవంబర్‌లో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా చేసిన తర్వాతే అధ్యక్షుడు గోటబయ రాజపక్స తన సోదరుడు మహింద రాజపక్సను దేశ ప్రధానిగా నియమించారు. శ్రీలంక రాజ్యాంగం ప్రకారం, తదుపరి పార్లమెంట్ ఎన్నికల వరకు రణిల్ ప్రధాన మంత్రి పదవిలో కొనసాగవచ్చు.