WHO: డ్రాగన్ కంట్రీ చైనాలో (China) పుట్టిన కరోనా (Covid-19) మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు మూడేళ్లు అల్లకల్లోలం సృష్టించింది. కోట్ల మంది మహమ్మారి (Virus) బారిన పడ్డారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
WHO: డ్రాగన్ కంట్రీ చైనాలో (China) పుట్టిన కరోనా (Covid-19) మహమ్మారి ప్రపంచాన్ని వణికించింది. దాదాపు మూడేళ్లు అల్లకల్లోలం సృష్టించింది. కోట్ల మంది మహమ్మారి (Virus) బారిన పడ్డారు. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మరెంతో మంది చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు. మహమ్మారి దెబ్బకు దిగ్గజ కంపెనీలు దివాళా తీశాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త చక్కబడుతోంది. తిరిగి సాధారణ రోజులొస్తున్నాయి. ఇంతలోనే పిడుగులాంటి వార్త చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization). ఇంతటితో ఆగిపోలేదని.. మునుముందు కరోనా కంటే డేంజర్ వైరస్ రావొచ్చని… దానిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించింది.
జెనీవాలో జరిగిన 76వ వార్షిక ఆరోగ్య సదస్సులో డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ (Tedros Adhanom) ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామన్న టెడ్రోస్.. త్వరలో అంతకంటే ప్రాణాంతకమైన మహమ్మారి భవిష్యత్తులో రావొచ్చని తెలిపారు. ఆ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచం రెడీగా ఉండాలని హెచ్చరించారు. కరోనా ముగిసినంత మాత్రాన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితి ముగిసినట్లు కాదని టెడ్రోస్ వెల్లడించారు.
ఊహించని విధంగా ఒక్కసారిగా కరోనా మహమ్మారి వచ్చిందని.. దానిని ఎదుర్కొనేందుకు అప్పటికి ప్రపంచం సిద్ధంగా లేకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని టెడ్రోస్ వెల్లడించారు. అయితే కొత్త మహమ్మారి వచ్చే ముప్పు ఉన్నందున ఇప్పటి నుంచే సిద్ధంగా ఉంటే.. దానిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. కేసులు, మరణాల సంఖ్య కూడా తగ్గుతుందన్నారు. ఇందుకోసం ప్రభావవంతమైన అంతర్జాతీయ యంత్రాంగం అవసరమని వివరించారు. కొత్త మహమ్మారి వచ్చినప్పుడు నిర్ణయాత్మకంగా, సమిష్టిగా దానిని ఎదుర్కొనేలా యంత్రాంగం ఉండాలని టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు.