Kailasa Ambassador in UN: నిత్యానందుడి లీల… ఐరాసలో కైలాస ప్రియ
Kailasa Ambassador in UN: నిత్యానంద స్వామి ఇప్పుడు ఎక్కడున్నాడు… ఎలా ఉన్నాడు అనే ప్రశ్నలు ఇంకా ప్రశ్నలుగానే ఉన్నాయి. ఆయనపై అత్యాచారం వంటి కేసులు నమోదు కావడంతో దేశం విడిచి పారిపోయాడు. ఎక్కడికి వెళ్లాడు అనే సంగతి రహస్యంగానే ఉండిపోయింది. అయితే, ఆయన సొంతంగా ఓ దీవిని కొనుగోలు చేశాడు. అయితే, దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద దానికి కైలాస అనే పేరును పెట్టాడు. ఆ దేశానికి సొంత అజెండా, జెండా, రిజర్వ్ బ్యాంక్, పాలనా వ్యవస్థ, పార్లమెంట్ ఇలా అన్నింటినీ ఏర్పాటు చేసుకున్నాడు. సొంత కరెన్సీని కూడా ఏర్పాటు చేశాడు.
అయితే, ఈ దేశానికి సంబంధించి పాస్‌పోర్ట్ ను కూడా మంజూరు చేస్తున్నారు. ఇదంతా అనధికారికం అని ఇప్పటి వరకు అనుకుంటే, తాజాగా కైలాస దేశానికి సంబంధించి ఐరాసలో శాశ్వత రాయబారిని కూడా ఏర్పాటు చేశారు. తలకు పాగా, నుదిటిన బొట్టు, మెడలో నగలు వేసుకున్న ఓ విదేశీ వనిత తనను తాను కైలాస శాశ్వత రాయబారిగా పరిచయం చేసుకుంది. తన పేరు విజయ ప్రియ నిత్యానందగా పేర్కొన్నది. ఐక్యరాజ్య సమితి కమిటీ ఆన్ ఎకనామిక్ సోషల్ అండ్ కల్చర్ రైట్స్ అనే సదస్సును నిర్వహించింది. ఈ సదస్సు ముఖ్యోద్దేశం సభ్యదేశాల సుస్థిర అభివృద్ధి సాధించడమే. ఈ 19వ సదస్సులో విజయప్రియ నిత్యానంద హాజరై సుస్థిరతపై ప్రసంగం చేసింది.
హిందూత్వానికి, సుస్థిరతకు సంబంధం ఉందని, హిందూత్వ సిద్ధాంతాలను పూర్తిగా విశ్వసిస్తే తప్పకుండా ఆయా దేశాలు సుస్థిరతను సాధిస్తాయని తెలిపారు. తమ సుప్రీం లీడర్ నిత్యానందపై తాను పుట్టిన దేశం భారత్ వేధిస్తోందని, శిక్షించాలని చూస్తోందని అంటూ విమర్శలు చేసింది. ఈ విమర్శలు ఎలా ఉన్నా, అసలు నిత్యానంద సొంతంగా దేశాన్ని ఎలా సృష్టిచాడు. ఎవరు అనుమతులు ఇచ్చారు అన్నది ప్రశ్నార్థకం.
సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటి? ఎవరు వాటిని నిర్ణయిస్తారు? జెండా అజెండాను వారే ఏర్పాటు చేసుకోవచ్చా? దేశంగా ఐరాస గుర్తించిందా లేదా? గుర్తిస్తే ఏ ప్రాతిపదికన గుర్తించింది? నిత్యానంద స్వామి చేసిన విధంగానే ఓ టెర్రరిస్తో మరో ఆర్థిక నేరాలకు పాల్పడిన వ్యక్తో సొంతంగా ఓ దీవిని కొనుగోలు చేసుకొని దానిని దేశంగా ప్రకటించుకుంటే ఐరాస వారికి కూడా మద్దతు ఇస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మెదళ్లలోనూ మెదులుతున్నాయి. నేరాలకు పాల్పడిన ప్రతి ఒక్కరూ ఇదే పంధాలో ఆలోచిస్తే ప్రపంచం గతి ఏమౌతుంది?
ఇదీ కాకుండా, అసలు కైలాస దేశానికి ఎవరు ఆహ్వానం పంపారు అన్నది కూడా ఇప్పటికీ ప్రశ్నార్ధకమే. పిలువకుండా ఇలాంటి సదస్సులకు హాజరుకావడం అసాధ్యం. అంతేకాదు, ఐరాసలో శాశ్వత రాయబారులను, ఉద్యోగులను కైలాస దేశం నియమించింది అంటే ఆ దేశాన్ని ఐరాస గుర్తించినట్టే కదా. 150 దేశాల్లో కైలాస రాయబారులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. కైలాస దేశంలో ప్రత్యేకంగా తర్ఫీదు పొందిన వారిని రాయబారులుగా నియమిస్తోంది. మరి భారత్‌లో కూడా కైలాస దేశానికి చెందిన రాయబారి ఉంటాడా? కైలాస దేశాన్ని భారత్ గుర్తిస్తుందా అన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే.