ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత మొదటిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. అక్టోబర్‌లో పుతిన్ చైనాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై (Putin) అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ (ICC Arrest Warrant) జారీ చేసిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లోని (Ukraine) పిల్లలను రష్యా అపహరించిందన్న ఆరోపణల నేపథ్యంలో పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఎక్కడ అరెస్ట్ చేస్తారేమోనని పుతిన్.. అప్పటి నుంచి విదేశీ పర్యటనలకు వెళ్లడంలేదు. ఇటీవల బ్రిక్స్ (BRICS) సమావేశాలకు కూడా పుతిన్ హాజరు కాలేదు.
అయితే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయిన తర్వాత మొదటిసారి పుతిన్ రష్యా అంతర్జాతీయ సరిహద్దులు దాటుతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్‌లో చైనాలోని (China) బీజింగ్‌లో బెల్ట్ అండ్ రోడ్ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు పుతిన్ హాజరుకానున్నారట. ఆ సదస్సుకు హాజరు కావాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Xi Jinping).. పుతిన్‌ను ఆహ్వానించారట. ఈ మేరకు పుతిన్ చైనా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటన నిమిత్తం క్రెమ్లిన్ షెడ్యూల్‌ను సిద్ధం చేస్తోందట.
ఇకపోతే కొద్దిరోజులుగా రష్యా, చైనా దేశాల మధ్య బంధం బలపడుతోంది. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించినప్పటి నుంచి రష్యాపై ప్రపంచదేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ చైనా ఎటువంటి ఆంక్షలు విధించలేదు. పైగా ఆ రెండు దేశాల మధ్య బంధం మరింత మొరుగుపడింది. ఇటీవల షీ జిన్‌పింగ్ రష్యాలో కూడా పర్యటించారు.