Chinese spy balloon: చైనా స్పై బెలూన్ ను కూల్చేసిన అమెరికా
Chinese spy balloon: చైనాకు చెందిన స్పై బెలూన్ ను అమెరికా ఎట్టకేలకు కూల్చేసింది. అమెరికా గగనతలంలో ఆ బెలూన్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆ బెలూన్ ను కూల్చివేస్తే ప్రజలకు నష్టం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ బెలూన్ ను తమ దేశ యుద్ధ విమానాల సాయంతో సముద్రతలాల వైపునకు తీసుకొచ్చి పేల్చేసినట్లు అమెరికా రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
తమ దేశానికి చెందిన ఫైటర్ జెట్‌లతో తమ ప్రాదేశిక జలాలలోనే ఆ భారీ బెలూన్‌ను కూల్చివేశారు. దక్షిణ కాలిఫోర్నియా మర్టల్ బీచ్ ప్రాంతంలో ఆ బెలూన్ శకలాలు పడ్డాయి. అమెరికా, చైనా మధ్య ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఈ బెలూన్ కలకలం రేపడం గమనార్హం. బెలూన్ కూల్చివేత విజయవంతంగా పూర్తి చేయటం పైన వైమానిక దళ సిబ్బందిని అధ్యక్షుడు బైడెన్ అభినందించారు. ఇదే సమయంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశానికి చెందిన ఈ బెలూన్ గతి తప్పి ప్రమాదవశాత్తు అమెరికా గగనతలంలోకి ప్రవేశించిందన్నారు.