US aid to Ukraine: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం
US aid to Ukraine: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమయ్యి సుమారు 11 నెలలు కావోస్తున్నా ఇప్పటి వరకు ముగింపు పలకలేదు. రెండు రోజులపాటు యుద్ధవిరమణను ప్రకటించిన రష్యా, ఆ విరమణను ఉల్లంఘించి ఉక్రెయిన్‌పై విరుచుకుపడింది. ఉక్రెయిన్‌లోని ఖేర్సన్ నగరంపై క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో అనేక భవనాలు ధ్వసమయ్యాయి. 36 గంటల కాల్పుల విరమణ అని చెబుతూనే దాడులు చేయడంపై ఉక్రెయిన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధానికి అగ్రరాజ్యం అమెరికా మరోసారి భారీగా సైనిక సాయాన్ని ప్రకటించింది.
3.75 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించింది. ఈ సహాయం కింద అనేక అయుధాలను అందించేందుకు సిద్ధమైంది. ఇందులో మోర్టార్లు, రైఫిళ్లు, మిషిన్ గన్లు, రాకెట్ వ్యవస్థలు, ఆర్ఐఎమ్ క్షిపణులు ఇతర మందుగుండు సామాగ్రి వంటివి ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగించడానికి అవసరమైన మందుగుండు సామాగ్రిని సహాయంకింద అందించడంతో రష్యా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రరాజ్యం సహాయం చేసినంత కాలం తాము ఉక్రెయిన్‌పై సైనికచర్యను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ దేశాన్ని ఆక్రమించుకోవాలనే దురుద్దేశం లేదని, కానీ, తమ సార్వభౌమత్వానికి ఇబ్బందులు కలిగితే చూస్తూ ఊరుకోబమని స్పష్టం చేసింది. నాటోలో చేరబోమని స్పష్టమైన హామీ ఇస్తేనే సైనిక చర్యలను నిలిపివేస్తామని రష్యా తెలియజేసింది.