Tension Situation in US and Russia: అమెరికా డ్రోన్‌ను కూల్చివేసిన రష్యా… ప్రచ్చన్నయుద్ధం తరువాత
Tension Situation in US and Russia: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే రెండు దేశాల్లో ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్ నాటోలో చేరకూడదని స్పష్టమైన హామీ ఇచ్చేంత వరకు తాము యుద్ధం కొనసాగిస్తామని రష్యా చెబుతుండగా, నాటో సహకారంతో ఉక్రెయిన్ యుద్ధం కొనసాగిస్తోంది. అమెరికాతో సహా అనేక నాటో దేశాలు ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందిస్తున్నాయి. యుద్ధ విమానాలను అందిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన నిఘా డ్రోన్ రష్యాకు సమీపంలో నల్ల సముద్రంలో కూలిపోయింది. ఈ నిఘా డ్రోన్‌ను రష్యా జెట్ ఫైటర్ మిగ్ 29 అడ్డుకుంది. రష్యా భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో అడ్డుకునేందుకు ప్రయత్నించామని, డ్రోన్ ను ఢీకొట్టడంగాని, కాల్పులు జరపడంగాని చేయలేదని రష్యా స్పష్టం చేసింది.
అయితే అమెరికా వాదనలు వేరుగా ఉన్నాయి. విమానం డ్రోన్ ప్రొపెల్లర్‌ను డీకొనడం వల్ల దానిని సముద్రంలో కూల్చివేయవలసి వచ్చిందని జో అధికారులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని అమెరికాలోని రష్యా రాయబార కార్యాలయానికి సమన్లు జారీ చేసింది. మరోవైపు మాస్కోలోని అమెరికా రాయబార కార్యాలయం కూడా నిరసన వ్యక్తం చేసింది. ప్రచ్చన్న యుద్ధం తరువాత రెండు దేశాల మధ్య ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ఇదే మొదటిసారి. ఈ ఘటన ఏ వైపుకు దారితీస్తుందో చూడాలి.