Ukraine President: పుతిన్ సజీవంగానే ఉన్నారా?
Ukraine President Sensational Comments on Putin: రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై సంవత్సరం కావొస్తున్నది. కానీ, ఇప్పటి వరకు యుద్ధం యుగియలేదు. వెనక్కి తగ్గినట్టే తగ్గి రష్యా ఆ ఉక్రెయిన్‌పై పట్టు బిగిస్తూ వస్తున్నది. యూరప్, అమెరికా దేశాల నుండి వస్తున్న ఆయుధాలతో ఉక్రెయిన్ యుద్ధం చేస్తున్నది. అయితే, విదేశీ ఆయుధాలు అందింనంత కాలం తాము కూడా యుద్ధం ఆపేది లేదని రష్యా స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా రష్యా మరింత తీవ్రస్థాయిలో యుద్ధం చేస్తుండటంతో పాటు ప్రైవేట్ ఆర్మీని కూడా రంగంలోకి దించడంతో చాలా ప్రాంతాలు రష్యాపరమయ్యాయి.
ఇక ఇదిలా ఉంటే, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలంగా పుతిన్ బహిరంగంగా కనిపించడం లేదని, డిసెంబర్ నెలలో జరగాల్సిన వార్షిక ప్రెస్ మీట్‌ను సైతం రద్దు చేశారని, దీంతో ఆయన సజీవంగా ఉన్నారా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జెలెన్‌స్కీ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తమ అధ్యక్షుడి గురించి చింతించాల్సిన అవసరం లేదని, తాము యుద్ధంలో గెలవబోతున్నామని, త్వరలోనే యుద్ధానికి స్వస్తి పలుకుతామని రష్యా చెబుతున్నది.