Srilanka Economic Crisis: పూర్తిగా కుప్పకూలిన శ్రీలంక ఆర్థిక వ్యవస్థ..కోలుకోవాలంటే..?
Srilanka Economic Crisis: గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల కారణంగా శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రధానిని మార్చినప్పటికీ ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు. ఇప్పట్లో కుదురుకునే పరిస్థితి కనిపించడం లేదని స్వయంగా ఆ దేశ ప్రధాని రణిల్ విక్రమసింఘే పార్లమెంట్‌లో పేర్కొన్నారు. ఆహారం, ఇంధనం, విద్యుత్‌తో పాటు అనేక రంగాల్లో తీవ్రమైన సంక్షోభం నెలకొన్నదని, రాబోయే రోజుల్లో ఈ సంక్షోభం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని ప్రధాని పేర్కొన్నారు. శ్రీలంక ప్రభుత్వం ఉపశమన చర్యలు చేపట్టినప్పటికీ విదేశీ మారకనిల్వలు అడుగంటిపోవడంతో ఇప్పట్లో కోలుకునే పరిస్థితులు లేవని ప్రధాని స్పష్టం చేశారు. ఎలాగైనా ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడాలని, లేదంటే దేశం అంధకారంలోకి జారిపోతుందని అన్నారు.
విదేశీమారకద్రవ్య నిల్వలను పెంచుకోవడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు . ఇప్పటికే భారత్ నుంచి సుమారు 400 కోట్ల డాలర్ల సాయం అందిందని, సాయం అందించేందుకు కూడా పరిమితి ఉంటుందని, తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించే ప్రణాళికలు దేశం వద్ద ఉండాలని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి శ్రీలంకకు భారత్ సాయం అందిస్తూనే వస్తున్నది. మరింత సాయం అందించేందుకు భారత్ ముందుకు వస్తుండటం పట్ల శ్రీలంక కృతజ్ఞతలు తెలియజేసింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు చెందిన సభ్యుల బృందం శ్రీలంకలో పర్యటిస్తోందని, వారితో చర్చలు జరుపుతున్నట్లు ప్రధాని రణిల్ విక్రమసింఘే తెలిపారు. చర్చలు సఫలమై, ఒప్పందం కుదుర్చుకోగలిగితే శ్రీలంక ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడేందుకు అవకాశం ఉంటుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.