US Signature Bank Shutdown: మూతపడిన సిగ్నేచర్ బ్యాంక్… భరోసా ఇచ్చిన బైడెన్
US Signature Bank Shutdown: ఆర్థిక మాంద్యం దెబ్బ టెక్ కంపెనీలపై మాత్రమే కాదు అటు బ్యాంకింగ్ రంగంపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఆ దేశంలో ఇప్పటికే సిలికాన్ వ్యాలీ పేరుతో నడుస్తున్న ఓ బ్యాంక్ మూతపడింది. ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నష్టాల్లో కూరుకుపోయింది. దీంతో బ్యాంకును నడిపేందుకు అవసరమైన నిధులు లేకపోవడం, వినియోగదారుల నుండి ఒత్తిడి పెరిగిపోవడంతో మూసేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ బ్యాంక్ వినియోగదారులు లబోదిబోమంటున్నారు. ఇక మరో బ్యాంక్‌ను కూడా మూసేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
యూఎస్‌లో పాపులర్ బ్యాంకింగ్ రంగంలో ఒకటైన సిగ్నేచర్ బ్యాంకును కూడా మూసేస్తున్నట్లు ప్రకటించారు. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిగ్నేచర్ బ్యాంకును మూసేస్తున్నట్లు అమెరికా నియంత్రణ సంస్థలు ప్రకటించాయి. హఠాత్తుగా బ్యాంకు మూతపడటంతో ఆ బ్యాంకు కష్టమర్లు ఆందోళనకు దిగారు. పెద్ద ఎత్తున బ్యాంకు వద్దకు చేరుకొని నినాదాలు చేశారు. హఠాత్తుగా బ్యాంకులు మూతపడుతుండటంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. కష్టమర్ల డిపాజిట్లు భద్రంగా ఉంటాయని ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఎవరి డిపాజిట్లు వారికి అందుతాయని జో బైడెన్ పేర్కొన్నారు. ఇప్పటికే రెండు బ్యాంకులు మూతపడ్డాయి. ఈ బాటలో మరికొన్ని సంస్థలు కూడా మూతపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.