Russian Scientist Andrey Botikov: కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన రష్యా శాస్త్రవేత్త దారుణ హత్య
Russian Scientist Andrey Botikov was killed by an intruder
రష్యాలో జరిగిన ఓ శాస్త్రవేత్త హత్య సంచలనంగా మారింది. స్పుత్నిక్ వి కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేసిన శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ హత్యకు గురయ్యాడు. ఓ ఆగంతకుడు ఇంట్లోకి చొరబడి బెల్టు సాయంతో శాస్త్రవేత్తను హత్య చేసినట్లు తెలుస్తోంది. రంగంలో దిగిన పోలీసులు కొన్ని గంటల వ్యవధిలోనే నేరస్థుడిని పట్టుకున్నారు.
దొంగతనం చేయడానికి ఇంట్లోకి చొరబడిన ఆగంతకుడు శాస్త్రవేత్తతో జరిగిన పెనుగులాటలో హత్య చేశాడని పోలీసులు తెలిపారు. 29 సంవత్సరాల ఆ ఆగంతకుడు బెల్టు సాయంతో శాస్త్రవేత్తను చంపాడని ,విచారణ సమయంలో తాను చేసిన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
హత్యకు గురైన శాస్త్రవేత్త ఆండ్రీ బొటికోవ్ గామలేయ నేషనల్ రీసెర్చ్ సెంటర్ లో 2014 నుంచి పనిచేస్తున్నాడు. 47 ఏళ్ల బొటికోవ్ స్పుత్నిక్ వ్యాక్సిన్ తయారు చేసిన బృందంలో ఉన్నాడు. ఇతర వ్యాక్సిన్ల కన్నా అత్యంత సమర్ధవంతగా పనిచేసే ఈ వ్యాక్సిన్ రష్యాలోని 60 శాతానికిపైగా ప్రజలకు అందించారు.
కలవరపెడుతున్న మరణాలు
ఇటీవల కాలంలో రష్యాలో ప్రముఖుల మరణాలు అధికారులను కలవరపెడుతున్నాయి. మేజర్ జనరల్ వ్లాదిమిర్ మకరోవ్ ఆత్మహత్య చేసుకున్నారు. తనని పదవి నుంచి తొలగించడంతో మనస్థాపం చెందిన ఆయన సుసైడ్ చేసుకున్నారు. ఈ సంఘటన జరగడానికి కొన్నివారాల క్రితం ఓ విమాన ప్రమాదంలో రష్యా బిలియనీర్ వ్యాచెస్లా తరణ్ మరణించారు. అదే విధంగా గత ఏడాదిలో మాస్కో ఏవియేషన్ ఇన్ స్టిట్యూట్ నాయకుడు అనటోలీ గెరచెంకో అకస్మాత్తుగా మరణించారు.