భారత ప్రధాని నరేంద్ర మోదీతో(Narendra Modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin )ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
PM MODI : భారత ప్రధాని నరేంద్ర మోదీతో(Narendra Modi) రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Putin )ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. అంతేగాక, సెప్టెంబర్ నెలలో ఢిల్లీ (Delhi)వేదికగా జరగనున్న జీ20 (G20)సదస్సుకు తాను హాజరు కాలేకపోతున్నానని మోదీతో పుతిన్ చెప్పినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
రష్యా తరపున విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ సదస్సుకు హాజరవుతారని పుతిన్ చెప్పినట్లు తెలిసింది. ఈ ఏడాది జీ-20 బృందానికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. సెప్టెంబర్ 9-10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జీ20 దేశాధినేతల సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి పుతిన్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశాలున్నాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇప్పటికే రష్యా స్పష్టత ఇచ్చింది. పుతిన్ ప్రత్యక్షంగా హాజరు కాబోరని తెలిపింది.
పుతిన్ వర్చువల్‌గా పాల్గొంటారా..? లేదా..? అన్నదానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పింది. తాజాగా, పుతిన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఏ రకంగానూ ఈ సదస్సులో పాల్గొనబోనని, తన తరపున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ హాజరవుతారని పుతిన్ స్పష్టం చేశారు.
ఇటీవల దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్ బర్గ్‌లో బ్రిక్స్ సదస్సుకు కూడా పుతిన్ హాజరుకాలేదు. ఆయన తరపున సెర్గీ లావ్రోవ్ పాల్గొన్నారు. ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో విదేశాలకు వెళితే అరెస్ట్ చేసే ముప్పు ఉండటంతో.. పుతిన్ జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యా అధ్యక్షుడిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.