Russia-Ukraine War: రష్యా మరో వార్నింగ్… ఉక్రెయిన్ కు కొత్త చిక్కులు
Russia-Ukraine War: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. అమెరికా, యూరప్ దేశాల సహాయంతో ఉక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నది. తాజాగా ఉక్రెయిన్‌కు అమెరికా 3.75 బిలియన్ డాలర్ల మిలటరీ సహాయాన్ని ప్రకటించారు. ఈ సహాయం ద్వారా మరికొన్ని రోజులపాటు రష్యా సేనలను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్‌కు అవకాశం ఉంటుంది. కాగా, అమెరికా చేస్తున్న సైనిక సహాయంపై కెమ్లిన్ స్పందించింది. ఉక్రెయిన్‌కు పాశ్చాత్య దేశాలు సహాయం చేయడం అంటే, ఉక్రెయిన్ ను మరింత కష్టాల్లోకే నెట్టడమేనని కెమ్లిన్ ప్రతినిధి పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించే ఆలోచనలో ఉక్రెయిన్ లేదని, ఎవరు ఎన్నిరకాల ఆయుధాలను అందించినా వాటిని నిర్వీర్యం చేసి తీరుతామని, ఉక్రెయిన్‌కు ఆయుధాలు అందించే కొలది తాము కూడా సరికొత్త ఆయుధాలతో దాడులు చేస్తామని రష్యా ప్రకటించింది.
ఇప్పటికే రష్యాకు డ్రోనుల సహాయంతో పెద్ద ఎత్తున యుద్ధం చేస్తున్నది. డ్రోనుల దాడుల్లో ఉక్రెయిన్ భీతిల్లిపోతున్నది. రష్యా దాడుల్లో విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా అక్కడి ప్రజలు విద్యుత్ లేక, మంచినీరు అందక అవస్థలు పడుతున్నారు. అమెరికాతో పాటు, అటు ఫ్రాన్స్‌కూడా తేలికపాటి యుద్ధట్యాంకులు అందించేందుకు ముందుకు రావడంతో, రష్యా మరిన్ని దాడులను పాల్పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా అమ్ములపొదిలోని సరికొత్త ఆయుధాలను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఉక్రెయిన్‌కు కొత్త కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.