BRICS Summit: బ్రిక్స్ సదస్సులో పుతిన్ కీలక వ్యాఖ్యలు..అలా చేయకుంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది
BRICS Summit Putin Comments:ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం సుదీర్ఘకాలంపాటు సాగేలా కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై భారీ దాడులు చేస్తూ ఒక్కొక్కటిగా తన ఆధీనంలోకి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పశ్చిమ దేశాలు కీవ్‌కు అండగా నిలిచేందుకు ప్రయత్నిస్తూ ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తున్నాయని, ఆయుధాలు అందించినంతకాలం యుద్ధం జరుగుతూనే ఉంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే పలుమార్లు పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన మరోసారి బ్రిక్స్ సదస్సులో పేర్కొన్నారు. బ్రిక్స్ 14వ శిఖరాగ్ర సదస్సును ఈ ఏడాది వర్చువల్ గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బ్రిక్స్ సభ్యదేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్, చైనా,దక్షిణాఫ్రికా దేశాల నేతలను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించారు.
పశ్చిమ దేశాల స్వార్థపూరిత చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కొన్ని దేశాల స్వార్థపూరితమైన చర్యల కారణంగానే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడిపోయిందని, ఈ స్థితి నుంచి బయటపడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. నిజాయతీ, పరస్పర ప్రయోజనకర విధానాలు అవసరమని, అప్పుడే ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడొచ్చని పుతిన్ పేర్కొన్నారు. అంతేకాదు, బ్రిక్స్ దేశాల మధ్య మరింత బలమైన సంబంధాలు నెలకొనాలని, బ్రిక్స్‌ను బలోపేతం చేసేందుకు తగిన నిర్ణయాలు తీసుకోవాలని పుతిన్ ఈ సందర్భంగా తెలిపారు.