Rahul Gandhi: పార్లమెంట్ లో మా మైకులు మూగబోతాయి..రాహుల్ గాంధీ
Rahul Gandhi: భారత్ జోడో యాత్ర తర్వాత తన లుక్ మార్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. వరుస కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. గత వారం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్ లో ప్రసంగించారు. సోమవారం లండన్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌లోని గ్రాండ్ కమిటీ రూంలో లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించారు. భారత్‌లో రాజకీయ నాయకుడిగా మీ అనుభవాలను చెప్పండని కొందరు అడిగినప్పుడు రాహుల్ మా గొంతును అధికార పార్టీ నొకేస్తుందని పార్లమెంట్ లో మా మైక్ లు పనిచేయవు అలా అని అవి ఎప్పుడో కాదు ప్రతిపక్షనాయకులు మాట్లాడుతుంటే అవి కట్ అయిపోతాయి అని అన్నారు.
నోట్ల రద్దు, జీఎస్టీ, చైనా సైన్యం చొరబాటు ఇలా అనేక అంశాలపై పార్లమెంటులో మాట్లాడడానికి తమను అనుమతించలేదని చెప్పారు. లోతైన చర్చలు జరిగే వేదికగా పార్లమెంటు తనకు గుర్తుందని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నిర్వహించిన భారత్ జోడో యాత్ర విశేషాలను కూడా ఆయన పంచుకున్నారు. ప్రవాస భారతీయుల సమావేశంలో కూడా రాహుల్ మాట్లాడుతూ బీజేపీపై విరుచుకుపడ్డారు.