America: భారతీయులపై జాత్యహంకార ఘటన.. దేశం విడిచిపోవాలంటూ బెదిరింపు
Racism Against Indians in America: అమెరికాలో జాతి విద్వేషం మరోమారు పడగ విప్పింది. భారతీయులు కనిపిస్తే చాలా విద్వేషాన్ని ప్రదర్శిస్తూ దారుణంగా అవమానిస్తున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఆగస్టు 26న టెక్సాస్‌లో నలుగురు మహిళలకు, ఈ నెల 1న కాలిఫోర్నియాలో ఒకరికి ఇలాంటి చేదు అనుభవమే ఎదుకాగా. తాజాగా, అమెరికా చట్టసభ్యురాలు ప్రమీల జయపాల్‌కు ట్విట్టర్ వేదికగా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అమెరికాను విడిచి వెంటనే స్వదేశానికి వెళ్లిపోవాలని బెదిరిస్తూ ఓ వ్యక్తి ఆడియో క్లిప్‌లను షేర్ చేశాడు.
వీటిని బయటపెట్టిన ప్రమీల.. సాధారణంగా రాజకీయ నాయకులు తమ దుర్బలత్వాన్ని ప్రదర్శించరని కానీ, హింసను అంగీకరించలేం కాబట్టే తాను ఈ ఆడియో క్లిప్‌లను బయటపెడుతున్నట్టు చెబుతూ తనకొచ్చిన ఐదు వాయిస్ క్లిప్పింగ్‌లను షేర్ చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు ఆధారంగా నిలిచే జాత్యహంకారం, లింగ వివక్షను సహించేది లేదని జయపాల్ పేర్కొన్నారు. ప్రమీల మొట్టమొదటి భారతీయ అమెరికన్ చట్టసభ్యురాలు. చెన్నైకి చెందిన ఆమె డెమొక్రటిక్ పార్టీ ప్రతినిధుల సభలో సియాటెల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఒకసారి ఆమె ఇంటి బయట ఓ వ్యక్తి తుపాకితో పోలీసులకు పట్టుబడ్డాడు.