Britain Political Crisis: బ్రిటన్ ప్రధాని రేసు నుంచి తప్పుకున్న ప్రీతి పటేల్..!
Britain Political Crisis: బ్రిటన్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. బ్రిటన్ హోం సెక్రెటరీ ప్రీతి పటేల్ ప్రధాని రేసులో తాను లేనంటూ కీలక ప్రకటన చేశారు. దీంతో కన్జర్వేటివ్ పార్టీ తరపున ప్రధాని పదవి రేసులో ఉన్న మాజీ ఛాన్స్లర్ రిషి సునాక్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. 2016 బ్రెగ్జిట్ రిఫరెండం సమయంలో డేవిడ్ కామెరున్ క్యాబినెట్ లో బోరిస్ జాన్సన్, మైకేల్ గోవ్తో పాటు ప్రీతి పటేల్ కూడా కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ప్రధాని పదవి రేసులో ఆమె పేరు కూడా బలంగా వినిపించింది.
అంతకు ముందు ప్రీతి మద్దతుదారులు.. పోటీ విషయంలో ఆమె ధృడంగా ఉన్నారని, సుదీర్ఘకాలం బ్రెగ్జిటర్గా ఉన్నారని పేర్కొన్నారు. మరికొందరు ప్రీతి పటేల్‌ను మార్గరేట్ థాచర్‌తో పోల్చారు. అయితే ఆమె మాత్రం పోటీలో ఉండడం లేదని క్లారిటీ ఇచ్చారు. సరిపడా మద్దతు లేనందునే ఆమె తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రీతి పటేల్‌కు పదమూడు మంది సభ్యుల మద్దతు ఉంది. ఇప్పుడు ఇలాంటి మద్దతు కోసం మిగతా సభ్యులు చూస్తున్నారు. మరోవైపు రేసులో ఉన్న రిషి సునాక్ తో పాటు సువెల్లా బ్రావర్మన్, లిజ్ ట్రుస్స్లు బ్రిటన్ ప్రధాని రేసులో నిలబడ్డారు. బ్రిటన్ ఎన్నికల నియామవళి ప్రకారం ప్రధాని రేసులో నిల్చునే అభ్యర్థి పేరును బ్యాలెట్ పేపర్లో చేర్చాలంటే కనీసం 20 మంది ఎంపీలు ప్రతిపాదిస్తూ మద్దతివ్వాల్సి ఉంటుంది. మరో వైపు ఉప ప్రధానితో పాటు ఇద్దరు మంత్రులు రిషి సునాక్ నాయకత్వాన్ని బలపరుస్తూ ప్రకటన చేశారు.