Srilanka political Crisis: శ్రీలంకలో కొనసాగుతున్న హైడ్రామా..అధ్యక్షుడు ఎవరంటే..!
Srilanka political Crisis: శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం క్రమంగా రాజకీయ సంక్షోభంగా మారడంతో నేతలు ప్రజాగ్రహానికి గురయ్యారు. రాజపక్సే కుటుంబ పాలనలో శ్రీలంక అన్ని విధాలుగా చితికి పోయింది. ప్రజలు చీకట్లో మగ్గిపోయారు. ప్రధానులు మారినా లంక నుదుటి రాతను, ప్రజల తల రాతలను మార్చలేకపోయారు. అవినీతి రాజ్యమేలడంతో ఆర్ధిక వ్యవస్థ చితికిపోయింది. ప్రజలు తిరగబడి ప్రెసిడెంట్ భవనాన్ని చుట్టుముట్టడంతో రాజపక్సే దేశం విడిచి పారిపోయాడు. అధ్యక్షుడి హోదాలో దేశం దాటిన రాజపక్సే మాల్దీవుల నుంచి సింగపూర్ కు పారిపోయారు. సింగపూర్ వెళ్లే ముందు రాజపక్సే తన రాజీనామాను శ్రీలంక పార్లమెంట్ స్పీకర్ కు పంపాడు.
కాగా, అధ్యక్షుడి రాజీనామాను స్పీకర్ అభయవర్ధనే ఆమోదించారు. కాగా ఈరోజు పార్లమెంట్ లో అఖిలపక్షం సమావేశం కానున్నది. ఈరోజు జరుగనున్న అఖిలపక్ష సమావేశంలో సాజిద్ ప్రేమదాస ను ఎన్నుకొనున్నట్లు తెలుస్తుంది. సాజిద్ ప్రేమదాస ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనుండగా ప్రెసిడెంట్ రాజపక్సే రాజీనామా చేసిన కారణంగా తాత్కాలిక అధ్యక్షుడిగా అభయవర్ధనే కొనసాగనున్నారు. అధ్యక్ష పదవికి సంబందించిన నోటిఫికేషన్ ను ఈనెల 19 వ తేదీన విడుదల చేయనున్నారు. 20 వ తేదీన శ్రీలంక అధ్యక్షుడి ఎన్నిక జరగనున్నది.
శ్రీలంకలో కొత్త ప్రభుత్వం ఎర్పడిన తర్వాత ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేలా చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. ప్రత్యేకించి పేదవర్గాలు అనుభవించే బాధలను తగ్గించాలి. చెల్లించాల్సిన విదేశీ రుణాల చెల్లింపు విధానాన్ని మార్చుకోవాలి. ఇందులో జులైలో చెల్లించాల్సిన అప్పు ఎక్కువగా ఉంది. ఐఎంఎఫ్ లాంటి సంస్థలతో కలిసి అప్పుల విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజలకు నిత్యావసరాలైన ఆహారం, ఇంధనం, మందుల దిగుమతికి అప్పు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. తప్పుడు విధానాలతో గొటబాయ దేశప్రయోజనాలను దెబ్బతీశారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. రాజపక్సే కుటుంబం తమ భవిష్యత్తును నాశనం చేసిందని, అవినీతితో దేశాన్ని లూటీ చేసిందని జనం రగిలిపోతున్నారు. కొత్త ప్రభుత్వం అనుభవజ్ఞులు, దేశ ప్రయోజనాల గురించి ఆలోచించే రాజకీయ నాయకులతో బృందాన్ని ఏర్పాటు చేసి సంక్షోభ నివారణకు ఉపక్రమించల్సి ఉంటుంది.