Srilanka crisis:శ్రీలంకను వేధిస్తున్న మరో సమస్య..అల్లాడుతున్న ప్రజలు
Srilanka Crisis: శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. సుమారు ఐదారు నెలల క్రితం నుంచి ఆ దేశంలో ఆర్ధిక సంక్షోభం మొదలైంది. అయితే, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు అక్కడి ప్రభుత్వం సరైన దృష్టి సారించకపోవడంతో మరింత ముదిరిపోయింది. అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే పరారీ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చాయి. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు వెలువడే స్థాయికి శ్రీలంకలో సంక్షోభం చేరింది. రెండు రోజుల క్రితం అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారులు ప్రధాని ఇంటిలోకి దూసుకెళ్లారు. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు… ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపై వాటర్ బాటిల్స్‌తో దాడి చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ ఫైరింగ్ చేసింది. టియర్ గ్యాస్‌తోపాటు ఫైరింగ్ జరిపింది సైన్యం.
మరో వైపు దేశంలో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఇక ఇప్పుడు మరో సమస్య ఆ దేశాన్ని పీడిస్తోంది. అదే ఆరోగ్య సమస్య. ఆసుపత్రుల్లో అత్యవసర చికిత్స అందించేందుకు అవసరమైన మందులు, పరికరాలు అందుబాటులో లేవని అక్కడి వైద్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేబిస్, ఎపిలెప్సి, ఎస్టీడీ వంటి జబ్బులకు వినియోగించే మందులు అందుబాటులో లేవని, కనీసం సర్జరీల సమయంలో ఉపయోగించే కాటన్ సైతం లేదని వైద్యులు చెబుతున్నారు.
ఆసుపత్రుల్లో కనీస అవసరాల కోసం వినియోగించే మందులు జాబితాను సర్కారుకు అందించామని, కానీ, ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోవడంతో వాటిని కొనుగోలు చేయలేకపోయినట్లు వైద్యులు చెబుతున్నారు. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగి, వైద్యులు సైతం చేతులు ఎత్తేస్తే హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తాయని ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుతం ప్రజలే తగిన జాగ్రత్తలు తీసుకొని అనారోగ్యం బారిన పడకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు.