World Economic Forum: దావోస్ వేదికగా కేటీఆర్ కీలక ప్రసంగం
World Economic Forum: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఇవాళ్టి నుంచి ప్రపంచ ఆర్థిక సదస్సు జరగనుంది. ఈ నెల 22వ తేదీ వరకు జరగనున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలంగాణ పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్, ప్రభుత్వ అధికారుల బృందం ఆదివారం రోజునే దావోస్ చేరుకుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు-2023 దావోస్‌లో జరగనుంది. కేటీఆర్‌కు జ్యూరిచ్ విమానాశ్రయంలో ఎన్నారైలు భారీ ఎత్తున వచ్చి ఘన స్వాగతం పలికారు. యూరోప్‌లో ఉన్న తెలంగాణ ప్రవాస భారతీయులు మంత్రికి స్వాగతం పలికారు.
ఈసారి భిన్న ప్రపంచంలో సహకారం అనే అంశం పై సదస్సు జరుగనుంది. ఇందులో మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేస్తారు. చర్చాగోష్ఠుల్లో పాల్గొంటారు. పారిశ్రామిక సంస్థల అధిపతులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. తెలంగాణాలో పెట్టుబడులు, పరిశ్రమల సాధనకు పారిశ్రామిక వేత్తలతో చర్చించే అవకాశముందని తెలుస్తుంది.
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు కేటీఆర్ హాజరుకావడం ఇది అయిదోసారి. గతంలో 2018, 2019, 2020, 2022 తాజాగా ఇప్పుడు ఐదవసారి.. ప్రతీ ఏటా జనవరిలో వరల్డ్ ఎకనామిక్ సమావేశాలు జరగనుండగా కోవిడ్ పరిస్థితుల్లో గత ఏడాది మేలో జరిగాయి. దాదాపు 52 దేశాల అధినేతలు హాజరవుతున్నారు. 130 దేశాలకు చెందిన 2,700 మంది ప్రతినిధులు ఇందులో పాల్గొని.. ఆర్థిక, ఇంధన, ఆహార సంక్షోభాల పరిష్కారంపై చర్చిస్తారు. భారత్ నుంచి కేంద్ర మంత్రులు కూడా హాజరుకానున్నారు.