Kim Jong Un: బలమైన అణ్వాయుధ శక్తిగా నిలవడమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యం..కిమ్
Kim Jong Un: దేశంతోపాటు పౌరుల గౌరవం, సార్వభౌమాధికారాన్ని కాపాడేందుకే అణ్వాయుధాలను నిర్మిస్తున్నాం.. ప్రపంచంలోనే అత్యంత బలమైన అణ్వాయుధ శక్తిగా నిలవడమే ఉత్తర కొరియా అంతిమ లక్ష్యం’ అని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాసాంగ్-17 (ఐసీబీఎం)ని ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యూహాత్మక అణ్వాయుధంగా ఆయన అభివర్ణించారు. పటిష్ఠమైన సైన్యాన్ని నిర్మించగల తమ సంకల్పం, సామర్థ్యాన్ని ఇది చాటుతుందని పేర్కొన్నారు.
ఇప్పటివరకు ఎనిమిది ఖండాంతర క్షిపణులతో పాటు పదుల సంఖ్యలో దీర్ఘ, మధ్యశ్రేణి క్షిపణులను పరీక్షించింది. కొరియా ద్వీపకల్పం చుట్టూ అమెరికా, దక్షిణ కొరియా చేపడుతున్న సంయుక్త సైనిక విన్యాసాలపై ఉత్తర కొరియా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వరుస క్షిపణి ప్రయోగాలు చేపడుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గత శుక్రవారం దాదాపు 15 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం చేపట్టింది. అణ్వాయుధాలను సైతం మోసుకెళ్లగలిగే ఈ క్షిపణికి.. అమెరికాలోని ప్రధాన భూభాగాలను కూడా నాశనం చేయగల సామర్ధ్యం దీనికి ఉంది.
తిరుగులేని అణురాజ్యంగా కిమ్ ప్రకటించారు. ఆ తర్వాతనే అమెరికా ప్రాంతీయ భద్రతా సహకారాన్ని పెంచింది. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో కలిసి ‘‘ విజిలెంట్ స్టోమ్’’ పేరుతో ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపడుతోంది.