Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా పాజిటివ్..!
Joe Biden Corona Positive: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కరోనా సోకినా స్వల్పంగానే కరోనా లక్షణాలు ఉన్నాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఆయన అధ్యక్ష భవనంలోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు పేర్కొన్నది. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జీన్ పియర్ మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని తెలిపారు. వ్యాధి తీవ్రతను తగ్గించేందుకు యాంటీవైరల్ డ్రగ్ తీసుకున్నట్టు తెలిపారు.
అధ్యక్షుడు బైడెన్ ప్రస్తుతం శ్వేతసౌధంలో ఐసోలేషన్‌లో ఉంటూ విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు గత నెల రోజుల క్రితం కరోనా సోకింది. ఆమె త్వరగానే కోలుకున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కేసుల సంఖ్య 65 కోట్లను దాటింది. ముఖ్యంగా అమెరికాతో పాటు బ్రెజిల్, జర్మనీ, ఇండియా, చైనా వంటి దేశాలు ఇప్పటికే కరోనాతో బాధపడుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్లు వచ్చినా కూడా కరోనా మహమ్మారికి పూర్తిగా అడ్డుకట్ట పడటం లేదు.