Interesting Reports on Kim Jong Un: అంతర్జాతీయ మీడియాలో మళ్లీ కిమ్ కథనాలు… వాటికి బానిసయ్యాడంటూ వార్తలు
Interesting Reports on Kim Jong Un: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ గురించి ఎప్పుడు ఎలాంటి వార్తలు వచ్చినా అవి ఆసక్తికరంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ దేశంలో ఏం జరుగుతుందనే విషయాలు ఎప్పుడూ బయటి ప్రపంచానికి తెలియవు. అధికారికంగా అక్కడి ప్రభుత్వం ప్రకటిస్తేనో లేదంటే అంతర్జాతీయ మీడియా లీకులు బయటపెడితేనో విషయాలు బయటకు వస్తుంటాయి. తాజాగా ఆయన వ్యక్తిగత విషయానికి సంబంధించిన కథనాలు బయటకు వచ్చాయి. త్వరలోనే కిమ్ 40 వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. దీంతో ఆయన మధ్యవయసుకు సంబంధించిన రుగ్మతలతో బాధపడుతున్నాడని, ఎక్కువ సమయం మద్యం సేవిస్తూ, విపరీతంగా ఏడుస్తున్నాడనే వార్తలు బయటకు వచ్చాయి.
కిమ్ ఆరోగ్యానికి సంబంధించిన వార్తలు తరచుగా బయటకు వస్తూనే ఉన్నా, అధికారికంగా ఎలాంటి ప్రకటనలు ఉండవు. అప్పుడప్పుడు ఆయన మీడియాకు కనిపించి, అధికారులు కొన్ని సూచనలు చేసి వెళ్తుంటాడు. నియంత జీవితానికి సంబంధించిన విషయాలు చాలా గోప్యంగా ఉంటాయి. ఉత్తర కొరియా వంటి దేశాలకు చెందిన సమాచారం బయటకు రావాలంటే అది చాలా కష్టం. సియోల్ కేంద్రంగా ఉత్తర కొరియా వ్యవహారాలను పరిశీలిస్తున్న డాక్టర్ చోయ్‌జిన్ వుక్ కిమ్ ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేయడం ఆశ్చర్యపరుస్తున్నది. ఆరోగ్యం కోసం వ్యాయామాలు చేయాలని, డైట్ నియంత్రణలో ఉంచుకోవాలని ఆయన భార్య, సలహాదారులు చెబుతున్నా కిమ్ పట్టించుకోవడం లేదని జిన్‌వుక్ చెప్పడం విశేషం. కిమ్ నిజంగానే అనారోగ్యానికి గురయ్యాడా లేదా అనే సంగతులు తెలియాలంటే ఆ దేశ మీడియా అధికారికంగా ప్రకటించేవరకు ఆగాల్సిందే.