Loco Pilot: సౌదీ అరేబియాలో మహిళా లోకో పైలెట్ .. మన తెలుగమ్మాయే
Indira Eegalapati is the First Woman Loco pilot in Saudi Arabia
సౌదీ అరేబియా క్రమ క్రమంగా మహిళలపై ఆంక్షలను ఎత్తివేస్తోంది. కఠిన నిబంధనలను సడలిస్తోంది. మహిళల పురోగతికి అడ్డుచెప్పడం లేదు. మహిళలు ఎట్టిపరిస్థితుల్లోను డ్రైవింగ్ చేయరాదని ఇంత కాలం ఉన్న నిబంధన తాజాగా తొలగిపోయింది. రియాద్ మెట్రో రైలులో ఓ మహిళా డ్రైవర్ ను నియిమించారు.
ఈగల పాటి ఇందిరా అనే ఈ లోకో పైలెట్ సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రో రైలులో లోకో పైలెట్ గా చేరింది. అక్కడ చేరడానికి ముందు హైదరాబాద్ మెట్రో రైలులో మూడేళ్ల పాటు లోకో పైలెట్ గా పనిచేసింది. 15,000 కిలో మీటర్ల ప్రయాణం చేసింది. ఆమె పనితీరు నచ్చిన రియాద్ మెట్రో అధికారులు ఆమెను ఆహ్వానించారు. సౌదీ అరేబియాలో అవకాశం రావడంతో అక్కడికి పయనమయింది. గుంటూరులో పుట్టి పెరిగిన ఇందిర హైదరాబాద్ నగరంలో స్థిరపడింది. హైదరాబాద్ మెట్రోలో చేస్తున్న సమయంలో కూడా ఆమె పేరు మారు మ్రోగింది.
ఇంజనీరింగ్ చేసిన ఇందిర భిన్నంగా ఉండాలని భావించింది. స్నేహితులందరూ ఐటీ ఉద్యోగాలలో స్థిరపడితే తాను మాత్రం లోకో పైలెట్ కావాలని నిర్ణయించుకుంది. తనని తాను తీర్చిదిద్దుకుంది. హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియా చేరింది. తనకు నచ్చిన పనిని ఎంతో ఆనందంగా చేస్తోంది. పలువురికి ఆదర్శంగా మారింది.
సౌదీ అరేబియాలోని రియాద్ మెట్రో సంస్థలో ఉద్యోగం రావడంతో తానెంతో సంతోషించానని ఇందిర గుర్తుచేసుకుంది. తన కుటుంబంలో కొందరు భయపడ్డారని, అంత దూరం ఎందుకని ప్రశ్నించారని ఇందిర తెలిపింది. తాను మాత్రం భయపడకుండా సౌదీ పయనమయ్యానని వివరించింది. ఇందిర తండ్రికి ముగ్గురు కుమార్తెలు. ముగ్గురికి చదువు చెప్పించే విషయంలో ఆమె తండ్రి వెనకడుగు వేయలేదు. మెకానిక్ పనులు చేస్తూనే ముగ్గురు కుమార్తెలను ఉన్నతంగా తీర్చిదిద్దాడు.