India Population: భారీగా తగ్గిపోనున్న జనాభా… ఏకంగా అన్ని కోట్లు మందా?
India’s population may shrink by 41 crore by 2100: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. 2027 నాటికి భారతదేశం జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని ఇటీవల ఐక్యరాజ్య సమితి పేర్కొంది. అయితే రానున్న 78 ఏళ్లలో భారత్ దాదాపు 41 కోట్ల జనాభాను కోల్పోనుందని తాజా నివేదిక చెబుతోంది. USలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ చేసిన ఒక అధ్యయనం ప్రకారం, జనాభాలో భారీ తగ్గుదల ఉంటుందట. ఐక్యరాజ్యసమితి జనాభా విభాగం తాజా నివేదిక ప్రకారం, 2022లో భారతదేశ జనాభా దాదాపు 141.2 కోట్లు. 2100లో అది 100.3 కోట్లకు తగ్గుతుందని అంచనా. ఫలితంగా, రాబోయే సంవత్సరాల్లో భారతదేశ జనాభా సాంద్రత కూడా గణనీయంగా తగ్గుతుందని అంటున్నారు.
నిజానికి భారతదేశం – చైనా జనాభా ఇప్పుడు దాదాపు సమానంగా ఉంది. అయితే, జనాభా సాంద్రత పరంగా రెండు దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. భారతదేశంలో చదరపు కిలోమీటరుకు సగటున 476 మంది జీవిస్తున్నారు. అయితే చైనాలో సగటు జనాభా చదరపు కిలోమీటరుకు 148 మంది మాత్రమే. 2100 నాటికి, భారతదేశ జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 335 మందికి తగ్గుతుందని కూడా అంచనా వేయబడింది. ప్రపంచంలోని జనాభా సాంద్రత తగ్గుదల కంటే భారతదేశ జనాభా సాంద్రతలో ఈ తగ్గుదల చాలా ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు భావిస్తున్నారు.
సంతానోత్పత్తి రేట్లు తగ్గడం వల్ల భారతదేశ జనాభా, జనాభా సాంద్రత క్రమంగా క్షీణించడం దీనికి కారణమని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం, భారతదేశపు సంతానోత్పత్తి రేటు ప్రతి స్త్రీకి 1.76గా ఉంది. అంటే ఒక్కో మహిళకు 1.76 మంది పిల్లలు పుడుతున్నారు. 2032లో ఈ సంతానోత్పత్తి రేటు 1.39కి తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా, సంతానోత్పత్తి రేటు 2052లో ప్రతి స్త్రీకి 1.28కి, 2082లో 1.2కి మరియు 2100లో ప్రతి స్త్రీకి 1.19కి తగ్గుతుందని అంచనా వేశారు. కానీ భారతదేశంలోనే కాదు, సంతానోత్పత్తి రేటు తగ్గే ఈ ధోరణి చైనా, USA సహా ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలలో కనిపిస్తుంది.
భారతదేశంతో పాటు, ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం తరువాతి శతాబ్దంలో జనాభా సహా జనాభా సాంద్రతలో క్రమంగా క్షీణతను ఎదుర్కొంటుందని భావిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, 2050 నాటికి మొత్తం ప్రపంచ సగటు సంతానోత్పత్తి రేటు 0.5 కంటే తక్కువగా పడిపోవచ్చని అంటున్నారు. అంటే, ప్రతి ఇద్దరు స్త్రీలలో ఒకరికి మాత్రమే బిడ్డ జన్మించనుందట. స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీ అధ్యయనం ప్రకారం, దేశం ఎంత సంపన్నంగా మారుతుందో, దాని సంతానోత్పత్తి రేటు అంత తక్కువగా ఉంటుందట. ఆ ఫలితంగా, ఆ దేశ జనాభా స్థిరంగా ఉండదని అంటున్నారు. అయినప్పటికీ, ప్రపంచ జనాభా యొక్క క్షీణిస్తున్న ఈ ధోరణికి ఆఫ్రికన్ దేశాలు వ్యతిరేక దిశలో వెళ్ళవచ్చు. ఎందుకంటే ఐక్యరాజ్యసమితి ప్రకారం, కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా సహా నైజీరియా వంటి దేశాలు 2100 వరకు జనాభా పెరుగుదల ట్రెండ్స్ కలిగి ఉన్నాయి.