ICC Arrest Warrant to Putin: పుతిన్‌కు ఐసీసీ అరెస్ట్ వారెంట్… అరెస్ట్ చేయలేరన్న రష్యా
ICC Arrest Warrant to Putin: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం మొదలై ఇప్పటికే సంవత్సరం దాటిపోయింది. ఇప్పటి వరకు రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ముగిసిపోలేదు. రష్యా క్రమం తప్పకుండా దాడులు చేస్తూనే ఉన్నది. నాటో దేశాలు ఉక్రెయిన్‌ను పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రి అందిస్తున్నాయి. ఆ దేశాల సహాయంతో ఉక్రెయిన్ యుద్దం చేస్తున్నది. అందమైన దేశంగా పేరొందిన ఉక్రెయిన్ కళావిహీనంగా మారిపోయింది. నగరాలు ధ్వంసమయ్యాయి. రష్యా చేస్తున్న అకృత్యాలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో కేసులు దాఖలయ్యాయి. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించినప్పటి నుండి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పుతిన్ యుద్ధనేరాలకు పాల్పడ్డారనే అభియోగంపై ఆయనకు వారెంట్‌ను జారీ చేస్తున్నట్లు ఐసీసీ న్యాయస్థానం పేర్కొన్నది. ఐసీసీ అరెస్ట్ వారెంట్‌పై రష్యా స్పందించింది. వారెంట్ జారీ చేయడమే తప్ప అరెస్ట్ చేసే అధికారం ఐసీసీకి లేదని, ఐసీసీ ఒప్పందంలో సంతకాలు చేసిన దేశాల పరిధిలోనే ఆ కోర్టుకు అధికారం ఉంటుందని, ఐసీసీ ఒప్పందంలో రష్యా సంతకం చేయలేదని, పుతిన్‌ను అరెస్ట్ చేసే అధికారం ఐసీసీకి లేదని ఆ దేశం స్పష్టం చేసింది. ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధంలో రెండు దేశాలు తీవ్రంగా నష్టపోయాయి. ఉక్రెయిన్ నాటోలో చేరబోమని హామీ ఇస్తే యుద్ధం విరమిస్తామని రష్యా చెబుతున్నది. కానీ, అందుకు ఉక్రెయిన్ ససేమిరా అనడంతో యుద్ధం కొనసాగుతూనే ఉన్నది.