ఏడు రోజుల్లోనే ఏడు వింతలను చూసి కొత్త గిన్నిస్ రికార్డును సృష్టించాడు ఒక వ్యక్తి.
World Record : గిన్నిస్ రికార్డులను (Guinness Record) సృష్టించాలని ఎంతోమందికి కోరికగా ఉంటుంది. కానీ అందరి వల్ల అది సాధ్యం కాదు. గిన్నిస్ రికార్డును (Records) సృష్టించాలనుకుంటే అందుకు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రపంచంలోని ఏడు వింతలను (Seven Wonders) ఏడు రోజులు వరసగా చూసి అడ్వెంచర్ మాన్ గా మారాడు ఒక వ్యక్తి. అతని పేరు జామీ మెక్ డోనాల్డ్. ఏడు రోజుల్లోనే ప్రపంచంలోని అన్ని వింతలను సందర్శించే విషయాన్ని సవాలుగా స్వీకరించాడు. ఆ సవాలును చేధించి చూపెట్టాడు.
ఏడు దేశాల్లో ఉన్న ఈ ఏడు వింతలను సరిగ్గా ఆరు రోజుల 16 గంటల 14 నిమిషాలలో సందర్శించాడు. మొత్తం పర్యటనలో మెక్ డోనాల్డ్ 13 విమానాలు, 16 టాక్సీలు, 9 బస్సులు, నాలుగు రైళ్లు మారాడు. నాలుగు ఖండాలలో ప్రయాణించాడు. మొత్తం 36, 780 కిలోమీటర్లు ప్రయాణించాడు.
మొదటగా అతడు చైనా వెళ్లాడు. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా సందర్శించి అక్కడ్నించి ఢిల్లీకి విమానంలో వెళ్లాడు. అక్కడ తాజ్ మహల్ సందర్భించాడు. భారత పర్యటన తర్వాత జోర్డాన్ వెళ్లే విమానాన్ని ఎక్కాడు. అక్కడ ఉన్న పెట్రా నగరానికి బస్సు మీద వెళ్ళాడు. సందర్శించాక విమానంలో ఇటలీలోని రోమ్ చేరుకున్నాడు. బస్సులో కొలోసియం ప్రాంతానికి వెళ్లి దాన్ని దర్శించాడు. ఆ తరువాత బ్రెజిల్ కి విమానంపై ప్రయాణించాడు. అక్కడ ఉన్న అతి పెద్ద క్రీస్టు విగ్రహం క్రీస్ట్ ద రిడీమర్ ను చూశాడు. అక్కడ్నించి మెక్సిలో వెళ్లాడు. చిచెన్ ఇట్జాను చూశాడు. అక్కడ్నించి మచుపిచూ చూసి తన పర్యటనను పూర్తి చేశాడు. ఇతని ప్రయాణానికి ట్రావెల్ హార్ట్ అనే సంస్థ సాయం చేసింది. ఇలా ఏడు వింతలను ఏడు రోజుల్లో పూర్తి చేసిన ఒకే ఒక వ్యక్తిగా మెక్ డోనాల్ట్ చరిత్రకెక్కాడు. ఇతను తొమ్మిదేళ్లుగా ఒక అరుదైన వెన్నెముఖ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆసుపత్రుల కోసం నిధులు సేకరించడం అతనికి అలవాటు. 2012 నుంచి ఇలా అడ్వెంచర్స్ చేస్తూ వచ్చిన మొత్తాన్ని ఆసుపత్రులకు విరాళంగా ఇస్తున్నాడు.