Gun Culture: అమెరికాలో ఈ జాడ్యం మారదా?
Gun Culture: ఎన్ని చట్టాలు చేస్తున్నా ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా అమెరికాలో గన్ కల్చర్ విష సంస్కృతికి అడ్డుకట్ట మాత్రం పడటం లేదు. అమెరికాలో గన్ కల్చర్ ను పూర్తిగా రూపుమాపుతామని ఇందుకు సంబంధించి చట్టాన్ని తీసుకొస్తామని గతంలోనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటన చేశారు కానీ అది ప్రకటనకే పరిమితం అయింది. అసలు విషయం ఏమిటంటే తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ తుపాకుల మోతతో ఒక రేంజ్ లో మారుమోగిపోయింది. లాస్ ఏంజెల్స్ సమీపంలోని మాంటేరీ పార్క్ లో శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఓ వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడ్డాడని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. మాంటేరీ పార్క్ లాస్ ఏంజెల్స్ కి కౌంటీ అనేది ప్రధాన నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. చైనా దేశస్తుల కొత్త సంవత్సర వేడుక అయిన లూనార్ న్యూ ఇయర్ ఫెస్టివల్ వేడుకలో ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఈ కాల్పుల ఘటనలో 10 మందికి పైగా మరణించినట్లు స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. ఈ కాల్పుల ఘటనలో మరో ఆరుగురు గాయపడినట్లు స్థానిక పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ కాల్పులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు ఇంకా గుర్తించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇక కాల్పులు జరిగిన సమయంలో న్యూ ఇయర్ వేడుకలలోవేల మంది చైనా దేశస్తులు ఉన్నారని ఈ క్రమంలో కాల్పులకు దిగిన వ్యక్తిని ఎవరూ గుర్తించలేదని అంటున్నారు. అంతా సంబరాల్లో మునిగి తేలుతుండగా కాల్పులతో అంతా చెల్లాచెదురయ్యారని, ఎక్కడివారు అక్కడ కుదిరిన వైపు పరుగులు తీశారని చెబుతున్నారు.
దీంతో నిందితుడు ఎవరు అనేది గుర్తించలేకపోయారు అని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. అయితే అక్కడి ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న ప్రకారం.. ఓ వ్యక్తి భారీ మెషిన్ గన్ తో అక్కడకు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు లాస్ ఏంజెల్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. మరోవైపు ఘటన జరిగిన వీధిలోనే సియాంగ్ వాన్ చాయి అనే వ్యక్తికి బార్బెక్యూ రెస్టారెంట్ ఉండగా అతను శనివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణభయంతో తన రెస్టారెంట్ లోకి వచ్చి తలుపులు వేసేశారని మీడియాకు వెల్లడించాడు.
బయట ఓ వ్యక్తి గన్ తో కాల్పులు జరుపుతున్నాడని .. తమను కాపాడాలని వారు తనను వేడుకున్నారని తాను బయటకు చూస్తె కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి వద్ద భారీగా మందుగుండు ఉన్నట్లు కనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇక తన రెస్టారెంట్ సమీపంలోని డాన్సింగ్ క్లబ్ లక్ష్యంగా అతడు దాడి చేసి ఉండొచ్చని ఆయన చెప్పుకొచ్చారు, అయితే ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే అక్కడికి చేరుకున్నారని వెల్లడించారు. వారు వచ్చిన వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది. ఏదేమైనా అమెరికాలో ఈ గన్ కల్చర్ జాడ్యం వదలడం లేదని, దాన్ని జోడెన్ అయినా వదిలించాలని అందరూ కోరుతున్నారు.