France : మెక్రాన్ సర్కార్ కు భారీ షాక్..జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయిన కూటమి..!
ఇటీవలే రెండోసారి అధికారంలోకి వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మెక్రాన్ సర్కార్ ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీలో మెజారిటీని కోల్పోయింది. ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీకి ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు సోమవారం రోజున ప్రకటించారు. ప్రతిపక్ష నేత జీన్ లూక్ మెలెన్‌చోన్ నేతృత్వంలోని న్యూప్స్ కూటమి గతంలో కంటే అధికస్థానాలను గెలుచుకొని మెక్రాన్ సర్కార్‌కు షాక్ ఇచ్చింది. మెక్రాన్ సారథ్యంలోని సెంట్రిస్ట్ కూటమి మెజారిటీ స్థానాలు దక్కించుకోలేకపోయినా, ఎక్కువ స్థానాలు మాత్రం గెలుచుకోగలిగింది.
ఫ్రాన్స్‌లో రెండో అసెంబ్లీ అయిన నేషనల్ పార్లమెంట్ అసెంబ్లీలోని మొత్తం 577 స్థానాలకు ఇటీవలే ఎన్నికలు జరిగాయి. ఇందులో మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమి 245 సీట్లు దక్కించుకోగా, జీన్ లూక్ నేతృత్వంలోని న్యూప్స్ కూటమికి 131 స్థానాలు దక్కాయి. అయితే, నేషనల్ అసెంబ్లీలో సంపూర్ణ మెజారిటీ దక్కాలంటే 289 సీట్లు రావాలి. కానీ, మెక్రాన్ కూటమికి 245 సీట్లు మాత్రమే వచ్చాయి. 2000 సంవత్సరంలో ఫ్రాన్స్ ఎన్నికల సంస్కరణలు చేపట్టింది. అప్పటి నుంచి అధికార పార్టీలు దిగువ అసెంబ్లీలో మెజారిటీ సాధిస్తూ వస్తున్నారు. అయితే, మొదటిసారి అధ్యక్షుడు మెక్రాన్ నేతృత్వంలోని సెంట్రిస్ట్ కూటమి మెజారిటీని కోల్పోయింది. దిగువసభలో మెజారిటీని కోల్పోయిన సిట్టింగ్ అధ్యక్షుడిగా మెక్రాన్ చరిత్రలో నిలిచిపోనున్నారు.