Earthquake in Afghanistan: ఆఫ్ఘన్, తజకిస్తాన్‌లో వరస భూకంపాలు… భయాందోళనలో ప్రజలు
Earthquake in Afghanistan and Tajikistan: తుర్కియే, సిరియా భూకంపాల ఘోరకలిని మరువకముందే ఆఫ్ఘనిస్తాన్, కజికిస్తాన్‌లో వరసగా భూకంపాలు సంభవించాయి. ఈ ప్రాంతంలో టెక్టోనిక్ ప్లేట్‌లు యాక్టీవ్‌గా ఉండి కదలికలు జరుగుతుండటంతో భూకంపాలు సంభవిస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్, తజకిస్తాన్‌లో వచ్చిన భూకంపాలే ఇందుకు నిదర్శనం. మంగళవారం తెల్లవారుజామున 4.05 గంటల సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించింది. దీని తీవ్రత 4.1 గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ఫైజాబాద్‌కు 315 కిమీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
భూ అంతర్భాగంలో 10 కిమీ లోతులో ఈ ప్రకంపణలు చోటు చేసుకున్నాయి. ఇక, ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం సంభవించిన గంట వ్యవధిలోనే అటు కజికిస్తాన్‌లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతగా నమోదైంది. దీంతో రెండు ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనలతో రోడ్డుపైకి పరుగులు తీశారు. టెక్టోనిక్ ప్లేట్లలో కదలికలు వస్తున్నాయని, ఈ రీజియన్‌లోనే ఎక్కువగా భూకంపాలు సంభవించడానికి ఇదొక కారణమని అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ రెండు భూకంపాల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయాల్సి ఉన్నది. ఈనెల 23 వ తేదీన తజికిస్తాన్‌లో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంపం కారణంగా అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ప్రజలు ప్రాణాలను కోల్పోయారు.