అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల జైలుకు వెళ్లిన సమయంలో మగ్ షాట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆ మగ్ షాట్ ట్రంప్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. లక్షల డాలర్లు ట్రంప్‌కు విరాళంగా వస్తున్నాయి.
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన కేసులో ట్రంప్.. జార్జియా జైలులో లొంగిపోయారు. అరెస్ట్ అయిన కొద్ది నిమిషాలకే ట్రంప్ బెయిల్‌పై బయటకొచ్చారు. కేవలం 20 నిమిషాలు మాత్రమే జైలులో గడిపారు. అయితే ఆ సమయంలో అందరు నిందితుల లానే ట్రంప్ కూడా మగ్ షాట్ (Mug shot) తీసుకున్నారు. అమెరికా చరిత్రలో మగ్ షాట్ తీసుకున్న తొలి మాజీ ప్రధానిగా ట్రంప్ రికార్డ్ కెక్కాడు. ప్రస్తుతం ఆ మగ్ షాట్ ట్రంప్‌కు కాసుల వర్షం కురిపిస్తోంది. లక్షల డాలర్లు ట్రంప్‌కు విరాళంగా వస్తున్నాయి.
జైలు నుంచి ట్రంప్ బయటకొచ్చిన వెంటనే.. తన మగ్ షాట్‌ను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటో క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో ఆ ఫొటోను టీషర్ట్స్, కాఫీ కప్స్, బీర్ కూజాలు, పోస్టర్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆ ఫొటో కింద నెవర్ సరెండర్ అని కూడా ప్రింట్ చేస్తున్నారు. అయితే ట్రంప్ ఫొటోతో తయారు చేసిన వస్తువులు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయట. జనాలు వాటిని కొనుగోలు చేసేందుకు విపరీతంగా ఇంట్రెస్ట్ చూపుతున్నారట.
ఈక్రమంలో ట్రంప్‌కు భారీగా విరాళాలు వస్తున్నాయి. కేవలం రెండు రోజుల్లోనే ట్రంప్‌కు 71 లక్షల డాలర్లు విరాళంగా అందాయట. అంటే భారత కరెన్సీలో రూ. 58 కోట్లు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సిబ్బంది కూడా ధృవీకరించారు.